హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ)/హైదరాబాద్ సిటీబ్యూరో : వేతనాలు పెంచాలంటూ నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం)పథకం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మంగళవారం భారీ ధర్నా చేపట్టారు. వేలాది మంది కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కోఠి ప్రధాన రహదారులను దిగ్బంధించారు. పెద్దసంఖ్యలో ఒకేసారి రోడ్లపైకి రావడంతో వారిని నిలువరించలేక పోలీసులు చేతులెత్తేశారు. ఫలితంగా కోఠి పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులన్నీ ట్రా ఫిక్‌తో స్తంభించాయి. దీంతో పోలీసులు కోఠికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను మూసివేశారు. వాహనాలను దారి మళ్లించారు. ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహ మాట్లాడుతూ.. ఎన్హెచ్ఎం కాంట్రాక్టు ఉద్యోగులకు క్యాడర్ ఫిక్సేషన్ చేసి బేసిక్ వేతనం అమలు చేయాలని డి మాండ్ చేశారు. ఎన్హెచ్ఎం కింద రాష్ట్రంలో సుమారు 17వేల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారని, 78 రకా ల క్యాడర్లలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ప్రజలకు వైద్యసేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నా.. వారికి కనీస వేతనాలు అమలుచేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. పైగా వేతనాలను రెండు మూడు నెలలు ఆలస్యంగా ఇస్తుండటంతో వేలాది కుటుంబాలు వీధిన పడే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా.. కనీసం వారి బేసిక్ పేతో సమానమైన జీతం కూడా ఇవ్వడం లేదని వాపోయారు. ఈ విషయంపై అనేక సందర్భాల్లో ఎన్హెచ్ఎం డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశామని, అయినా వారి నుంచి స్పందన లేదన్నారు.
అందుకే మహాధర్నా చేపట్టినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమా రాజేశ్‌కన్నా మాట్లాడుతూ.. ఉద్యోగులకు రావాల్సిన ఏడు నెలల పీఆర్సీ నేటికీ విడుదల చేయకపోవడం అన్యాయమని మండిపడ్డారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల ముట్టడిని పోలీసులు అడ్డుకోగా వారు రోడ్డుపై బైఠాయించా రు. పలువురు ఉద్యోగులు రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. పొర్లుదండాలు పెట్టారు. ఆ తర్వాత కమిషనరేట్ ముట్టడికి బయల్దేరగా పోలీసులు గేట్లు మూసివేసేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఉద్యోగులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కొందరికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యక్రమంలో యూ నియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలసుబ్రహ్మ ణ్యం, ఉప ప్రధాన కార్యదర్శి బాపుయాదవ్, నర్సింగ్ ఆఫీసర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నిశాంతిని, జ్యోతి, గోపి పాల్గొన్నారు.
ముందస్తు అరెస్టులు..
న్యూస్‌నెట్‌వర్క్: ఉమ్మడి నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆశ కార్యకర్తలు, పంచాయతీ కార్మికులను ఎక్కడికక్క డ నిర్బంధించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం చేపట్టగా వారిని హైదరాబాద్ వెళ్లకుండా అరెస్టు చేశారు. ఆశ కార్యకర్తలను అరెస్ట్ చేసి మహబూబ్‌నగర్ టౌటూన్ పో లీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ తీరు ను నిరసిస్తూ ఆశ కార్యకర్తలు బాన్సువాడ ఠాణా ఎదుట నిరసన తెలిపారు.