హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఈగల్ టీమ్ ఓ భారీ గంజాయి రాకెట్ గుట్టును ఛేదించింది. ఈగల్ టీమ్‌లో భాగమైన ఖమ్మం ఆర్ఎన్సీసీ, సైబరాబాద్ ఎన్డీపీఎస్ టీమ్‌లు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించి రూ.4.2 కోట్ల విలువ చేసే 847 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఇద్దరిని అరెస్టు చేసింది. వివరాల్లో వెళితే.. ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లో విస్తరించిన ఈ గంజాయి ముఠా.. గంజాయిని అధికారుల కళ్లుగప్పి రాష్ర్టాల సరిహద్దులు దాటిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న మహీంద్రా బొలెరో వాహనంలో ఒడిశా నుంచి గంజాయి తీసుకుని బెంగళూరు జాతీయ రహదారిపై తండపల్లి గ్రామం (శంషాబాద్) వైపు వెళ్తున్నదని పక్కా సమాచారం అందింది. దీంతో గంటలోపే ఈగల్ బృందాలు తండపల్లికి చేరుకుని ఆ వాహనాన్ని అడ్డుకుని వాహనంలో ఉన్న ఖిల్లా ధన (29), రాజేందర్ బజింగ్ (26)లను అరెస్టు చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకడైన ఖిల్లా ధన 2019లో నమోదైన ఓ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో 4నెలలు జైలు శిక్ష అనుభవించాడు. విడుదలైన తర్వాత ఈ ఏడాది భారీగా గంజాయిని తరలించినట్టు ఈగల్ టీమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు ఆయుధాలతో ప్రయాణిస్తూ.. అడ్డుకునే వారిపై కత్తులతో దాడి చేస్తుంటారని తెలిపారు. ఈ కేసులో వాహనం, సెల్ఫోన్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.