Maoists | కొత్తగూడెం క్రైం, సెప్టెంబర్ 15: ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు మరో దారుణానికి ఒడిగట్టారు. సుక్మా జిల్లాలో ఇన్ఫార్మర్ నెపంతో ఓ ఉపాధ్యాయుడిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ మేరకు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ప్రాథమిక వివరాలను వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జగర్గూండకు చెందిన ఉపాధ్యాయుడు దూది అర్జున్ను మావోయిస్టులు ఆయన ఇంటి నుంచి అపహరించారు.
శనివారం ఆ గ్రామ సమీపంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు.. అర్జున్‌పై కర్రలతో దాడి చేసి కొట్టి అతి దారుణంగా హత్య చేశారు. అర్జున్ పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడనే నెపంతో అతడిని దారుణంగా హత్య చేసిన మావోయిస్టులు.. అతడి కుటుంబీకులపై సైతం ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేసినట్టు గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై జగర్గుండా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.