కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఏప్రిల్ 28: ఎలాంటి షరతులు లేకుండా శాంతి చర్చలు జరపాలంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో సోషల్ మీడియాలో విడుదలైన లేఖ సంచలనం సృష్టించింది. 2024 జనవరి నుంచి కేంద్ర, రాష్ట్ర పోలీసులు, పారా మిలిటరీ, కమాండో బలగాలు ఆపరేషన్ ‘కగార్’ పేరుతో మావోయిస్టు విప్లవోద్యమ ప్రాంతాల్లో వందలాది మంది మావోయిస్టులను, అమాయక ఆదివాసీలను హత్య చేయడాన్ని ఖండిస్తూ.. దేశ వ్యాప్తంగా ప్రజాస్వామిక, విప్లవ ప్రజా సంఘాలు, మేధావులు ఉద్యమిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
తమ పార్టీ కేంద్ర కమిటీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని మార్చి 28న ఒక ప్రకటన విడుదల చేసినట్టు గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జార్ఖండ్ రాష్ట్రం బొకారోలో కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్‌తోపాటు మరి కొందరిని హత్య చేసినట్టు తెలిపారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతాల్లో 10 వేల మంది సాయుధ బలగాలతో దిగ్బంధించి, ఆరుగురు మావోయిస్టులను హత్యచేసిందని తెలిపారు. మారణకాండను వెంటనే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.