కొత్తగూడెం ప్రగతి మైదాన్, మే 29 : మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు హిడ్మాను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. కోరాపుట్ పోలీస్ అధికారులు గురువారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా బోయిపారిగూడ పోలీస్‌స్టేషన్ పరిధి పేటగూడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు జిల్లా పోలీసులు, జిల్లా వలంటరీ ఫోర్స్(డీవీఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ క్రమంలో ఆ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగడంతో తట్టుకోలేక కాల్పులు జరుపుకుంటూనే మావోయిస్టులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమ ంలో ఒక మావోయిస్టును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
సదరు పట్టుబడ్డ మావోయిస్టును ఏరియా కమిటీ సభ్యుడు కుంజం హిడ్మాగా పోలీసులు గుర్తించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసుర్ పోలీస్‌స్టేషన్ పరిధి జనగూడ గ్రామానికి చెందిన హిడ్మా మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇతడి వద్ద నుంచి ఒక ఏకే-47 రైఫిల్‌ను, ఘటనా స్థలం నుంచి మందుగుండు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హిడ్మాపై రూ.4 లక్షల రివార్డు ఉందని, ఇతడిపై కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాలోని పోలీస్స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.