కొత్తగూడెం ప్రగతి మైదాన్, మే 22: దండకారణ్యంలో గురువారం మళ్లీ కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఒక మావోయిస్టు, ఒక జవాన్ మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బుధవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో సీపీఐ (మావోయిస్టు) పార్టీ సుప్రీం కమాండర్, ప్రధాన కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర మిలిటరీ కమిషన్ సభ్యుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతిచెందిన విషయం విధితమే.
ఈ ఘటన జరిగిన 24గంటల వ్యవధిలోనే సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న జవాన్లకు బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దు తుమ్రేల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగడంతో మావోయిస్టులు పారిపోయారు. అనంతరం భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
ఒక మావోయిస్టుతోపాటు కోబ్రా 210వ బెటాలియన్‌కు చెందిన జవాన్ మెహుల్ సోలంకి మృతిచెందినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టులకు చెందిన ఆయుధ, వస్తు, సామగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్జీ భద్రతా దళాలు పాల్గొన్నాయి. గుజరాత్ రాష్ర్టానికి చెందిన మెహుల్ కోబ్రా బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.