ఫర్టిలైజర్‌సిటీ, డిసెంబర్ 2: మంచిర్యాల జిల్లా ఇందారంలో మావోయిస్టు దంపతులను అరెస్ట్ చేసినట్టు రామగుండం సీపీ రెమా రాజేశ్వరి తెలిపారు. శనివారం రామగుండంలోని కమిషనరేట్‌లో ఆమె మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇందారంలోని ఓ ఇంట్లో సీపీఐ మావోయిస్టు పార్టీ సెంట్రల్ టెక్నికల్ టీమ్ క్యాడర్ డీ గంగాధరరావు అలియాస్ నర్సన్న అలియాస్ బక్కన్న అలియాస్ వెంగోదాదాతోపాటు అతని భార్య భవానీ అలియాస్ సుజాత అలియాస్ శ్యామల ఉన్నట్టు అందిన సమాచారం మేరకు ప్రత్యేక పోలీసు బృందం సభ్యులు అక్కడికి వెళ్లారు. వారిని అదుపులోకి తీసుకొని, ఠాణాకు తరలించారు.
వారి వద్ద రూ.1.57 లక్షల నగదు, పాన్‌కార్డు, ఏటీఎం కార్డు, రెండు ఆధార్‌కార్డులు, బ్యాంకు పాస్‌బుక్, రెండు మొబైల్ ఫోన్లు, ఆరు మెమరీ కార్డులు, ట్యాబ్, రెండు పెన్‌డ్రైవ్‌లు, పార్టీకి సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. వీరికి పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం పెంచికల్పేటకు చెందిన మావోయిస్టు సానుభూతిపరుడు చిప్పకుర్తి శ్రీనివాస్ సాయం చేసినట్టు తెలిసింది. కాగా అతను పరారీలో ఉన్నట్టు సీపీ తెలిపారు. వీరు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో రెండు, మూడేండ్లుగా తిరుగుతూ పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. గంగాధర్రావుపై రూ.20 లక్షలు, ఆయన భార్య భవానీపై రూ.4 లక్షల రివార్డు ఉన్నట్టు ఆమె పేర్కొన్నారు.