ములుగు, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): మావోయిస్టులు భద్రపర్చుకున్న డంపు, మందుగుండు సామగ్రిని ములుగు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ శబరీశ్ వివరాలను వెల్లడించారు. తాడ్వాయి మండలం బంధాల రిజర్వ్ అటవీ ప్రాంతంలోని ఒడ్డుగూడెం గ్రామ సమీపంలో వెట్టెవాగు వద్ద సీపీఐ మావోయిస్టు ఆయుధాల డంపు ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఉదయం ములుగు జిల్లా పోలీసులతోపాటు బీడీటీం బృందాలు అనుమానాస్పద ప్రాంతానికి చేరుకొని సోదాలు నిర్వహించాయి.
సీపీఐ మావోయిస్టులు అమర్చిన ఆయుధాల డంపును గుర్తించాయి. అందులో రెండు ఎస్ఎల్ఆర్ తుపాకులతోపాటు 165 రౌండ్ల తూటాలు, ఓ స్ప్రింగ్ ఫీల్, రెండు ఎస్ఎల్ఆర్ మాగ్జన్ల పౌచ్‌లు లభించాయి. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు పోలీసుల ఎదుట స్వచ్ఛ ందంగా లొంగిపోతే ప్రభుత్వం ద్వారా పునరావాసం కల్పిస్తామని ఎస్పీ వెల్లడించారు. ఆయన వెంట ఏఎస్పీ రవీందర్, సీఐ రవీందర్, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.