హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలపై లేని చర్చ పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఎందుకని పలు యూనివర్సిటీల ప్రొఫెసర్లు, మేధావులు ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. మోదీ సర్కారు కుట్రపూరితంగా సం క్షేమ పథకాలను ఎత్తేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను తొలగిస్తే తీరని నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. డాక్టర్ బీఆర్ అంబేదర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో సార్వత్రిక సామాజిక వేదిక (ఓపెన్ టాక్) ద్వారా ప్రతి నెలా వర్తమాన అంశాలపై ఒక లెక్చర్ కొనసాగుతుంది.
అందులో భాగంగా సోమవారం ‘సంక్షేమ పథకాలు.. ఉచితాలా? ప్రోత్సాహకాలా?’ అం శంపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొ ఫెసర్ డాక్టర్ చిట్టెడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్ శక్తులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు గుదిబండ కావటం లేదా? అల్పాదాయ వర్గాల అభ్యున్నతికి అందించే సంక్షేమ పథకాలే భారమయ్యాయా? అన్న ప్రశ్న వస్తున్నదని అన్నారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. పేదవాడి విషయంలోనే చర్చ ఎందుకు అని ప్రశ్నించారు. అంబేదర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు మాట్లాడుతూ.. సంక్షేమం వద్దనటం, పథకాలను ఉచితాలు అనటం మూర్ఖత్వమని అన్నారు.