HCU Issue | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ‘చూసీ చూడనట్టు వదిలిపెడుతుంటే మీరు హద్దులు దాటుతున్నారు.. హెచ్‌సీయూ భూములతో మీకేం సంబంధం.. మీ పని మీరు చూసుకోకుండా రాజకీయాల్లో వేలెందుకు పెడుతున్నారు, మీ వ్యక్తిగత ప్రచారం కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తారా’ అంటూ తెలంగాణ ముఖ్యనేత సినిమా వాళ్లపై ఫైర్ అయినట్టు తెలిసింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లను కూల్చడం మీద సినీ ప్రముఖులు స్పందించటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే తోలు తీస్తామంటూ హెచ్చరించినట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సినీ ఇండస్ట్రీని లీడ్ చేస్తున్న ఓ ప్రముఖ ప్రొడ్యూసర్‌కు ముఖ్యనేత ఫోన్ చేసి ఎడాపెడా దురుసుగా మాట్లాడినట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
మరోవైపు పలువురు తెలుగు సినీ ప్రముఖులు ప్రభుత్వ దాష్టీకాన్ని నిరసించారు. ‘మీరు ఇదే గనక చేయాలనుకుంటే అకడున్న మూగజీవాలు, పక్షులకు ఎకడ పునరావాసం కల్పిస్తారు? నరికివేసిన చెట్లను తిరిగి ఎకడ పెంచుతారు?’ అని సినీ హీరో రాంచరణ్ సతీమణి ఉపాసన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘సీఎం రేవంత్‌రెడ్డిగారూ ఒక తల్లిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. మన రేపటితరానికి ఆక్సిజన్, నీళ్లు అవసరం. అభివృద్ధి అవసరం. ఐటీ పారులు, బహుళ అంతస్తుల భవనాలు.. అన్నీ అవసరమే! కానీ ఈ 400 ఎకరాలను మాత్రం వదిలేయండి. నిర్మానుష్యంగా ఉన్న భూములను వెతకండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను.
ఏదో ఒకటి చేయండి. ఒక తల్లిగా అడుకుంటున్నాను. ఒకసారి ఆలోచించండి’ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూదేశాయ్ వీడియో రిలీజ్ చేశారు. మూగజీవాలను అడవి నుంచి తరిమేయకండి అంటూ యాంకర్ రష్మీ గౌతమ్ మరో వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలకు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. సినీ ప్రముఖుల స్పందనతోనే హెచ్‌సీయూ భూముల విధ్వంసం వీడియో వైరల్ అయిందని భావించిన ముఖ్యనేత వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది.