హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ముదిరాజ్ కులం అతిపెద్దదని, రాష్ట్ర జనాభాలో 7.64 శాతం ఉండి, 35 నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నప్పటికీ రాజకీయంగా ముదిరాజ్‌లకు తగిన ప్రాధాన్యత లేదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మంగళవారం ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ముదిరాజ్ సింహావలోకనం జరిగింది. వేదిక అధ్యక్షుడు డాక్టర్ దినేశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముదిరాజ్‌ల రిజర్వేషన్లు, ఎస్ఈఈఈపీసీ రిపోర్ట్‌పై మేధోమథనం జరిపారు.
ఈ సందర్భంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ ముదిరాజ్‌ల రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకెళ్లి, బీసీ కమిషన్‌కు అప్పగించిందని తెలిపారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ముదిరాజ్‌లు తమ న్యాయమైన వాటా అడుగడం తప్పా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో డాక్టర్ చిరంజీవి, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, పిట్టల రవీందర్, ఆహ్వాన సంఘం కన్వీనర్ జూలు నాగేశ్వర్, కావలి చెన్నయ్య, పిట్టల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.