Drugs Testing Kit | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రగ్స్ టెస్టింగ్ కిట్లపై అనుమానాలు తలెత్తుతున్నాయి. డ్రగ్స్ తీసుకునే వారిని త్వరగా గుర్తించేందుకు అందుబాటులోకి తెచ్చిన కిట్లలో నాణ్యత లోపించిందని పలువురు నిపుణులు చెప్తున్నారు. డ్రగ్స్ తీసుకోకపోయినా ‘డ్రగ్ పాజిటివ్’ అని రావడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. డ్రగ్స్ కిట్లతో నిర్వహిస్తున్న టెస్టుల్లో తప్పుడు ఫలితాలు వస్తున్నాయని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
తమకు డ్రగ్స్ అలవాటు లేదని చెప్పినా.. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది అడ్డంగా కేసు బుక్ చేస్తున్నారని లబోదిబోమంటున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఓ చోట పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని డ్రగ్స్ కిట్స్‌తో మూత్రపరీక్ష నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. వారిలో ఓ యువకుడు తనకు మత్తుపదార్థాల అలవాటు లేదని, జ్వరానికి మాత్రలు వేసుకున్నానని చెప్పినా వినలేదు. తీరా అతనికి దవాఖానలో రక్తపరీక్షలు నిర్వహించగా ‘నెగిటివ్’ అని వచ్చింది.
దీంతో పోలీసులు, టీజీ న్యాబ్ అధికారులు కంగుతిన్నారు. ఇలాంటిదే మరో ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకున్నది. న్యూ ఇయర్ సందర్భంగా ఆబారీ పోలీసులు ఓ పబ్‌లో సోదాలు చేపట్టారు. పలువురు అనుమానితులకు డ్రగ్ టెస్టింగ్ కిట్లతో చేసిన పరీక్షల్లో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. అయితే, వారికి సైతం దవాఖానలో నిర్వహించిన రక్తపరీక్షల్లో ఎలాంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదంటూ వైద్యులు నిర్ధారించారు. దీంతో ఎక్సైజ్ సిబ్బంది సైతం ఖిన్నులయ్యారు. వరుస పరిణామాలతో ఇన్నాళ్లూ డ్రగ్ టెస్టింగ్ కిట్లతో చేసిన పరీక్షలపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
గతంలో డ్రగ్స్ తనిఖీల్లో చికిన వారి నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షించేవారు. ఒకో పరీక్షకు రూ.5వేలు ఖర్చయ్యేది. ఇవే పరీక్షలను తేలికగా నిర్వహించేందుకు డ్రగ్ టెస్టింగ్ కిట్లను అందుబాటులోకి తెచ్చారు. వాటిని టీజీ న్యాబ్ ఆధ్వర్యంలో ఆబారీ, హెచ్‌న్యూ పోలీసులు సరఫరా చేస్తుండటంతో వాటినే ఎకువగా ఉపయోగిస్తున్నారు. కేవలం రెండు నిమిషాల్లో వ్యక్తి తీసుకున్న డ్రగ్ ఏంటో ఈ పరికరం సూచిస్తుంది. ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్ ద్వారా గంజాయి, కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్డీ సహా 11 రకాల మత్తు పదార్థాలను గుర్తించే వీలు ఉంటుంది. అనుమానితుల మూత్రం, లాలాజలం నమూనాలు సేకరించి వారు డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అని ఈ కిట్లతో సెకన్లలో తేల్చేస్తున్నారు.
అయితే, మొదట్లో 100శాతం కచ్చితత్వం వచ్చిన కిట్స్.. ప్రస్తుతం 70-80 శాతం మాత్రమే ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి వాటికి కొన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా మూత్రపరీక్షలో పాజిటివ్ వస్తుందని సాక్షాత్తూ టీజీన్యాబ్ సిబ్బందే చెబుతున్నారు. కిట్లతో చేసే పరీక్షల్లో భిన్న ఫలితాలు రావడం తలనొప్పిగా మారిందని అంటున్నారు. దీంతో కిట్లతో ప్రాథమిక పరీక్ష నిర్వహించి, అనంతరం పూర్తి నిర్ధారణకు దవాఖానలకు తరలిస్తున్నారు. అక్కడ కూడా నెగిటివ్ వస్తుండటంతో.. ఆశ్చర్యపోవడం పోలీసులవంతవుతున్నది.