Munipalli | మునిపల్లి, మే 21: సంగారెడ్డి జిల్లా మునిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అనుచరుడు, రైకోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూరి సుధాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులను ఉద్దేశించి అందరూ దొంగలే.. మీ అందరి తోలు తీస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించినట్లు తెలిసింది. మహిళా అధికారులు ఉన్నారనే విచక్షణ కూడా లేకుండా, ఇష్టమొచ్చిన భాషలో మాట్లాడారని రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మునిపల్లికి చెందిన ఓ వ్యక్తి రెసిడెన్స్ సర్టిఫికెట్‌కు అవసరమైన పత్రాలను సమర్పించకపోవడంతో రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. దీంతో ఆగ్రహానికి గురైన సుధాకర్ రెడ్డి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అధికారుల్లా పనిచేయండి.. దొంగల్లా చేయకండి అంటు దురుసుగా మాట్లాడాడు. పైసల్ ఇస్తేనే పనులు చేస్తామని మెడలో బోర్డులు వేసుకోండి అంటూ అవమానించాడు. మిమ్మల్ని బట్టలు విప్పి రోడ్డుపై నిలబెడతా.. మీ అంతుచూస్తా అంటూ మహిళల ముందే అవమానకరంగా మాట్లాడినట్లు సమాచారం. ఈ ఘటనపై కార్యాలయానికి వచ్చిన ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అనుచరుడిగా పేరొన్న మంతూరి సుధాకర్ రెడ్డి పలుమార్లు రెవెన్యూ అధికారులపై పెత్తనం చెలాయించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ లెవల్లో నేను మీటింగ్ తీసుకుంటా. అందరూ హాజరుకావాలని దురుసుగా మాట్లాడారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం లేకపోయినా ఫర్వాలేదు.. ఇలాంటి వాళ్లతో మాటలు పడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు. తమతో ఇస్టానుసరాంగా వ్యవహరిస్తున్న మంతూరి సుధాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బంది కోరుతున్నారు. ఈ వ్యవహారాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లాలని చర్చించుకుంటున్నారు.