హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ‘సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఏడాది దావోస్‌కు వెళ్లి ఇజ్రాయిల్ ఇన్నోవేషన్ అథారిటీని కలిసిండ్రు..వారు తెలంగాణలో పెట్టిన పెట్టుబడి శూన్యం..కానీ సీఎం సోదరుడు కొండల్‌రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నరు.. ఎంవోయూకు ముందు ఇజ్రాయెల్‌కు చెందిన ఎకనమిక్ అండ్ ట్రేడ్ మిషన్ ఆఫ్ ఇజ్రాయెల్ టూ ఇండియా హెడ్ యాయిర్ ముషారఫ్..రేవంత్‌రెడ్డి సోదరుడు, రూ.లక్ష మూలధనం కలిగిన, ఒక చిన్న ఇంట్లో కొనసాగుతున్న టెస్సెరాక్ట్ కంపెనీ చైర్మన్ కొండల్‌రెడ్డిని కలిసిండ్రు..ఆ తర్వాతే ఇజ్రాయెల్‌కు చెందిన రెడ్లర్ టెక్నాలజీస్ కంపెనీతో ఒప్పందం కుదిరింది..అనంతరం ఆ కంపెనీకి ఫోర్త్‌సిటీలో రూ.200 కోట్ల విలువైన భూమిని కేటాయించిండ్రు’ అంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ సంచలన విషయాలు వెల్లడించారు. ‘ప్రస్తుతం కొండల్‌రెడ్డి ఇజ్రాయెల్ డిఫెన్స్ కంపెనీకి చైర్మన్ అయ్యారు.. ఇది ఎలా సాధ్యమైంది? ఇజ్రాయెల్ అధికారిని కొండల్‌రెడ్డి ఏ హోదాలో కలిసిండు?’ అని ప్రశ్నించారు.
గతంలోనూ అమెరికాకు వెళ్లి తన మరో సోదరుడు అనుముల జగదీశ్‌కు చెందిన స్వచ్ఛ్ బయో కంపెనీతో వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారని గుర్తుచేశారు. మంత్రి శ్రీధర్‌బాబు మాత్రం టెస్సెరాక్ట్ కంపెనీతో కొండల్‌రెడ్డికి సంబంధంలేదని ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ..ఇప్పుడు వస్తున్న వివరాలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. అలాగే మ్యాక్స్ బియన్ ఫార్మా, మెడికవర్‌లో రేవంత్‌రెడ్డి బావమరిది పెట్టుబడులు, వ్యాపార లావాదేవీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లెవనెత్తిన ప్రశ్నలకు సీఎం ఇప్పటివరకు సమాధానం చెప్పకపోవడంలోని ఆంతర్యమేందని నిలదీశారు. ‘అసలు సీఎం విదేశీ పర్యటనలు తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకా? తన బ్రదర్స్ బిజినెస్ కోసమా?’అని ప్రశ్నించారు. దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. సోమవారం తెలంగాణ భవన్లో క్రిశాంక్ విలేకరులతో మాట్లాడారు. ఆధారాలు చూపుతూ ఇజ్రాయెల్‌కు చెందిన రెడ్లర్..కొండల్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న టెస్సెరాక్ట్ మధ్య జరిగిన అక్రమ ఒప్పందాన్ని బట్టబయలు చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి మూడేండ్లలో చేసిన విదేశీ పర్యటనల ద్వారా తెలంగాణకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు? ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? అని క్రిశాంక్ ప్రశ్నించారు. అన్ని వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ‘సింగపూర్, దక్షిణకొరియా, జపాన్, దుబాయ్, దావోస్, అమెరికా, యూకే సహా అనేక దేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ లాంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ విద్యాసంస్థలను ఫోర్త్‌సిటీకి తీసుకువస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు తెలంగాణకు వచ్చింది ఏందో? ప్రజలకు ఒరిగిందేందో? ప్రభుత్వం బయటపెట్టాలి’ అని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ విదేశీ పర్యటనలు, ఎవరెవరిని కలిశారు? ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు? అనే అంశాలపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయని చెప్పారు. నివృత్తి చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు మౌనం వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇజ్రాయెల్‌తో చేసుకొనే ఒప్పందాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అనేకసార్లు ప్రశ్నించారని క్రిశాంక్ గుర్తుచేశారు. పార్లమెంట్‌లోనూ ప్రస్తావించిన విషయాన్ని వెల్లడించారు. కానీ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలపై మౌనం వహించడం ఎందుకని ప్రశ్నించారు. ఢిల్లీలో ఒక విధానం..తెలంగాణలో మరో విధానమా? ఇది ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనంకాదా? అని ప్రశ్నలవర్షం కురిపించారు. ఇప్పటికైనా సొంత పార్టీ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. సీఎం విదేశీ పర్యటలు, విదేశీ సంస్థలతో జరిగిన సమావేశాలు, కుదుర్చుకున్న ఒప్పందాలు, కంపెనీలకు అడ్డగోలుగా భూ కేటాయింపులు, సీఎం కుటుంబసభ్యులు, అనుచరుల వ్యాపార వ్యవహారాలపై కేంద్రం స్పందించాలని కోరారు. సమగ్ర, స్వతంత్ర సంస్థతో విచారణ సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాము చేస్తున్న ఆరోపణలపై సీఎం సమాధానం చెప్పకున్నా..కేంద్రం విచారణకు ఆదేశించకున్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చట్టసభల్లో ఎండగడుతారని హెచ్చరించారు.