హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 144 మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం.. మండల పంచాయతీ అధికారులు (ఎంపీవోలు), మండల పరిషత్ సూపరింటెండెంట్లకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించింది. స్థానిక ఎన్నికలు జరిగేనాటికి ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉండకూడదని ఎన్నికల సంఘం ఆదేశించిన తరుణంలో కొత్త నియామకాలు జరిగే వరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు.
కానీ ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమను తిరిగి బదిలీ చేయకుండా కిందిస్థాయి అధికారులకు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించడాన్ని బదిలీ కాని ఎంపీడీవోలు 2024 ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను అనుసరించి ఎంపీడీవోలను వారు పనిచేస్తున్న జిల్లాల నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికల తర్వాత పాత జిల్లాలకు పంపించాలని ప్రభుత్వాన్ని ఎంపీడీవోలు కోరారు.
16 నెలల పోరాటం తర్వాత కొన్ని కొత్త నిబంధనలతో బదిలీలు చేశారు. కొన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడటంతో మండల పరిషత్ పరిపాలనలో తీవ్ర ఇబ్బందులు తలెత్తినట్టు కలెక్టర్లు నిరాకరిస్తున్నారు. దీంతో అర్హత కలిగిన వారిని కూడా కొన్ని జిల్లాలకు బదిలీ చేయలేదు. 12జిల్లాల్లో 33 ఎంపీడీవో పోస్టులు ఖాళీలు ఉన్నా అడిగిన ఎంపీడీవోలను బదిలీ చేయకుండా సూపరింటెండెంట్లకు, ఎంపీవోలకు స్థానిక జిల్లాల్లో ఇవ్వడం ఏమిటని ఎంపీడీవో అసోసియేషన్ నేతలు మండిపడుతున్నారు. సూపరింటెండెంట్లు, ఎంపీవోలు సొంత జిల్లా వాళ్లు కారా? వాళ్లు పనిచేస్తే తప్పు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. సంబంధం లేని పనులను తమతో చేయిస్తున్నారని.. కోరినచోట పోస్టింగ్ ఇస్తే ఇబ్బంది ఏంటని నిలదీస్తున్నారు.