హయత్‌నగర్, జనవరి 23: హయత్‌నగర్‌లోని నార్ముల్ మదర్ డెయిరీ సంస్థకు ఇటీవల నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మందడి ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం తన చైర్మన్ పదవితోపాటు డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. జనవరి 8న చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన నెల రోజులు దాటకముందే రాజీనామా చేయడం గమనార్హం. శుక్రవారం పాలకవర్గ సమావేశం అనంతరం ఆయన తన రాజీనామా లేఖను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా ఎండీ కృష్ణ మాట్లాడుతూ.. చైర్మన్ అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు లేఖ అందజేశారని వెల్లడించారు. పాలకవర్గ సభ్యులు సమావేశమై చైర్మన్ రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మదర్ డెయిరీ సంస్థ పాడి రైతులకు రూ.12 కోట్ల పాల బిల్లులను మందడి ప్రభాకర్‌రెడ్డి చెల్లిస్తానన్న ఒప్పందంతోనే, మధుసూదన్‌రెడ్డి ఈనెల 8న చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
అదే రోజున బాధ్యతలు చేపట్టిన మందడి ప్రభాకర్‌రెడ్డి మొదటి విడతగా రూ.3 కోట్లు ఫర్మ్ ద్వారా జమ చేయగా, అధికారులు పాడి రైతులకు పాల బిల్లులు పంపిణీ చేశారు. సంస్థకు ప్రభుత్వ సహకారం లేకపోవడం, సంస్థ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన పెద్దలు సైతం అసంతృప్తి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. తమ వేతనాల్లో కోతలపై బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు సైతం చైర్మన్ తీరును వ్యతిరేకించారు. ముందుగా ఇచ్చిన హామీ మేరకు మిగతా రూ.9 కోట్ల పాల బిల్లులు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో పాడి రైతులతో కలిసి ధర్నా చేస్తామని మాజీ చైర్మన్లు శ్రీకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు. దీంతో మందడి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా చేసినట్టు తెలుస్తున్నది.