హనుమకొండ, జూన్ 3: మార్పులు చేసి ఆమోదించిన జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం కొత్త రాష్ట్ర గీతాన్ని తెలంగాణ సమాజం అంగీకరించదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. సోమవారం ఆయన హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. ప్రజల గుండెల్లో నిలిచిన సంపూర్ణ గీతాన్ని మాత్రమే ఆమోదించాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో పాల్గొనలేదని, అందుకోసం ఆయన రాష్ట్ర అవతరణ వేడుకల్లో తన గురించి చెప్పుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణాన్ని ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు. చార్మినార్ వారసత్వ సంపద అని గుర్తుచేశారు. సమ్మక సారకను చంపింది కాకతీయ రాజులే అయితే గిరిజనులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. కాకతీయ కళా తోరణం గొప్ప వారసత్వ సంపదగా అందరూ గుర్తిస్తున్న విషయాన్ని స్పష్టం చేశారు. అందెశ్రీ రాసిన గీతాన్ని మార్చి సారం లేకుండా చేశారని ఆయన ఆరోపించారు.
సమ్మక్క, సారక్క, కుమ్రంభీమ్ పేర్లను తొలగించడాన్ని మంత్రి మంత్రి సీతక ఒప్పుకొంటారా? అని ప్రశ్నించారు. కంచర్ల గోపన్నతో సహా కవుల పేర్లు కొత్త గీతంలో లేకపోవడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంతోమంది బ్రాహ్మణ కవుల పేర్లు లేవనే విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు అంగీకరిస్తారా? ప్రశ్నించారు. రేవంత్రెడ్డి మాట విని అందెశ్రీ తనకు ఉన్న గౌరవాన్ని కోల్పోయారని విచారం వ్యక్తంచేశారు.
జయ జయహే తెలంగాణ గీతంలో రెడ్డిల పేరు ఎకడ లేకపోవడంతో ఇక వేరే ఇతర కులాల పేర్లు ఎందుకని పాటలో వచ్చిన మిగతా కులాల గొప్ప వ్యక్తుల పేర్లను లేకుండా రేవంత్రెడ్డి చేశారని విమర్శించారు. కాసు బ్రహ్మానందరెడ్డి పారు పేరును తొలగించి అమరుల పారుగా మార్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గీతంపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, అన్ని రాజకీయ పక్షాలను కలుస్తామని మంద కృష్ణ తెలిపారు.