కోరుట్ల, ఏప్రిల్ 14: ఏబీసీడీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని, మాదిగలకు అండగా నిలచే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కింగ్స్ గార్డెన్లో ఏర్పాటు చేసిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సదస్సులో ఆయన మాట్లాడారు.
మాదిగల భవిష్యత్తు తరాల కోసమే తన పోరాటమని, ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు విశ్రమించేది లేదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాదిగలకు పిలుపునిచ్చారు. వర్గీకరణతోనే మాదిగ బిడ్డలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కుతాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు ఒక్కరికి కూడా సీటు ఇవ్వలేదని మండిపడ్డారు.