కామారెడ్డి, మే 15 : 24 ఏండ్ల క్రితం తప్పిపోయిన ఓ వ్యక్తిని గుర్తించిన కామారెడ్డి పోలీసులు ఆయన కుమారులకు శుక్రవారం అప్పజెప్పారు. కామారెడ్డి పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా పూటాన్‌పల్లి కి చెందిన సత్యనారాయణచారి 24 సంవత్సరాల క్రితం తప్పిపోయాడు. కామారెడ్డి పట్టణంలో గురువారంరాత్రి పోలీసు కానిస్టేబుల్ అశోక్, హోంగార్డు రవి తనిఖీలు నిర్వహిస్తుండగా సత్యనారాయణచారి కనిపించాడు. అతడి నుంచి పూర్తి వివరాలు సేకరించి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. 24 ఏండ్లుగాఎక్కడెక్కడో తిరుగుతూ కామారెడ్డి పట్టణానికి వచ్చినట్లు సత్యనారాయణచారి తెలిపాడు.
కామారెడ్డి పోలీసులు వెంటనే గద్వాల్ పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో వారు గ్రామంలో విచారించగా సత్యనారాయణచారి తప్పిపోయిన విషయం నిజమేనని నిర్ధారణ చేసుకొని, ఆయన కుమారులను కామారెడ్డికి పంపించారు. పెద్ద కుమారుడు చిన శంకర్, చిన్న కుమారుడు జ్ఞానచారి (గణేశ్)కి వారి తండ్రి సత్యనారాయణచారిని అప్పజెప్పారు. 24 సంవత్సరాల తరువాత తన తండ్రిని అప్పజెప్పిన కామారెడ్డి సీఐ నరహరిని కొడుకులు శాలువాతో సత్కరించారు. కానిస్టేబుల్ అశోక్, హోంగార్డు రవి, పీసీ కమలాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.