 
                                                            మహబూబాబాద్, (నమస్తే తెలంగాణ) /మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 30: వైద్యం కోసం ప్రభుత్వ దవాఖానకు (Mahabubabad Hospital) వెళ్లి అక్కడే కుప్పకూలిన వ్యక్తిని డాక్టర్లు పరీక్షించకుండానే నేరుగా మార్చురీకి (Mortuary) తీసుకెళ్లాలని సిబ్బందిని ఆదేశించారు. మార్చురీకి తీసుకెళ్లిన తర్వాత స్వీపర్ గుర్తించి చెప్పడంతో చేసిన తప్పును డాక్టర్లు దిద్దుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఎల్టీ రాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేశాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య విభేదాలు రావడంతో అతడి భార్య పిల్లలను తీసుకొని అమ్మగారింటికి వెళ్లిపోయింది.
రాజు ఏడాది క్రితం ట్రాక్టర్‌పై నుంచి పడటంతో కాలుకు దెబ్బతగిలి, ఇబ్బం ది పడుతున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడం, భార్యాపిల్లలు వదిలి వెళ్లడంతో ఒక్కడే ఇంటి వద్ద ఉంటున్నాడు. వారం రోజుల కిత్రం కాలు నొప్పి ఉందని, చికిత్స కోసం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లాడు. ఓపీ కౌంటర్ వద్దకు వెళ్లి బొక్కల డాక్టర్‌కు చూపించుకోవాలి.. చిట్టీ ఇవ్వండని అడిగితే ఆధార్ కార్డుతోపాటు తోడుగా ఎవరైనా ఉంటేనే ఓపీ చిట్టీ ఇస్తామని చెప్పి పంపించారు. తోడు రావాలని ఎవరినీ అడిగినా సహకరించలేదు. వర్షానికి తడిసి సొమ్మసిల్లి పడిపోయాడు.
గుర్తించిన సిబ్బంది ఓపీ విభాగానికి తీసుకెళ్లారు. డ్యూటీ డాక్టర్ బుధవారం రాత్రి పరీక్షించి చనిపోయాడని నిర్ధారించగా సిబ్బంది రాజును మార్చురీ గదికి తీసుకెళ్లి బయట తాళం వేసి వచ్చారు. గురువారం ఉదయం మహిళా స్వీపర్ మార్చురీ గదిని శుభ్రం చేస్తుండగా, రాజు చేతులతో దగ్గరికి రావాలని సైగ చేశాడు. దీంతో ఆందోళన చెందిన స్వీపర్ భయంతో పరుగులు తీసి డాక్టర్లకు సమాచారం అందించింది. వెంటనే డాక్టర్లు, సిబ్బంది మార్చురీ గదికి వెళ్లి స్ట్రెక్చర్‌పై ఉన్న రాజును ఐసీయూకి తరలించి ట్రీట్మెంట్ చేశారు. రాజు కోలుకున్నాక జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు.
ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ విషయంపై ‘నమస్తే తెలంగాణ’ రాజును వివరాలు అడగగా.. తాను స్పృహ కోల్పోతే మార్చురీకి తరలించారని ఆవేదన వ్యక్తం చేశాడు. దవాఖాన ఆర్ఎంవో జగదీశ్ ను వివరణ కోరగా.. రాజు చనిపోయాడని డా క్టర్లు చెప్పలేదని, బయట పడి ఉన్న రాజును స్ట్రెచర్ మీద సిబ్బంది నేరుగా మార్చురీకి తరలించినట్టు తెలిపాడు. పూర్తి విచారణ చేసి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని వివరించారు.
 
                            