కరీమాబాద్ (వరంగల్), మార్చి 4 : మామునూరు ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూ సర్వే చేసేందుకు మంగళవారం నక్కలపల్లికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. రంగశాయిపేట నుంచి తమ గ్రామాలకు రోడ్డు నిర్మాణం చేపట్టిన తర్వాతే సర్వే చేపట్టాలని నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట, గాడిపెల్లి రైతులు అధికారులకు సూచించారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత రోడ్డు నిర్మాణం చేపడతామని అధికారులు చెప్పగా, అనుమతి వచ్చిన తర్వాతే ఇక్కడికి రండి.. అంటూ రైతులు స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని, పరిహారం ఎంత ఇస్తారనేది స్పష్టం చేసిన తర్వాతే సర్వే చేపట్టాలని తెలిపారు. దీంతో ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, ఖిలావరంగల్ తహసీల్దార్ నాగేశ్వర్రావు, అధికారులు వెనుదిరిగారు. డీసీపీ రవీందర్‌తో పాటు పరకాల, మామునూరు, నర్సంపేట ఏసీపీలు చేరుకుని రైతులను అడ్డుకున్నారు. మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తమ వల్లే అనుమతులు వచ్చాయని సంబురాలు చేసుకున్న అధికార పార్టీ నాయకులపై రైతులు మండిపడ్డారు. ఎకరానికి రూ.3 నుంచి రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డిమాండ్లు పరిష్కరిస్తేనే సర్వే చేయనిస్తం
మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణంలో గుంటూరుపల్లి, గాడిపల్లి, నక్కలపల్లికి చెందిన రైతులం 253 ఎకరాలు కోల్పోతున్నాం. పరిహారం ఇవ్వకుండానే సర్వే చేస్తామంటే ఎట్లా .. గతంలో గ్రామంలోకి వచ్చిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ సత్యశారద డిమాండ్ ప్రకారం పరిహారం ఇస్తామని, గుంటూరుపల్లి నుంచి మామునూరుకు కొత్తరోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి రోడ్డులేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు మూసేస్తే మూడు కిలోమీటర్లు దూరభారం పెరుగుతుంది. డిమాండ్లు పరిష్కరిస్తేనే భూములు ఇస్తం.
– వీరభద్రారావు, గుంటూరుపల్లి రైతుఎకరానికి
రూ.5 కోట్లు ఇవ్వాలి
ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికిఎకరానికి రూ.5 కోట్లు ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న వరంగల్-మహబూబాబాద్ రోడ్డు మూస్తే గుంటూరుపల్లి నుంచి మామునూరుకు రోడ్డు వేయాలి. నిర్వాతులకు విమానాశ్రయంలో ఉద్యోగాలు కల్పించాలి. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తన సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడి భూములు ఉన్న ప్రాంతం నుంచే పెద్ద రోడ్డు నిర్మాణం చేయాలని చూస్తున్నాడు. మా ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడంలేదు. భూములు కోల్పోయిన తర్వాత ఎలా బతకాలి. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని సమస్యలను పరిష్కరించాలి.
– వెంకట్రావు, గుంటూరుపల్లి రైతురేవంత్ సర్కారు హామీలు అమలు చేయాలి