హైదరాబాద్, సెప్టెంబర్25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజకీయాలకు అతీతంగా బీసీల ఉద్యమం బలోపేతానికే రాజ్యసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేశానని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల తరఫున చట్టసభల్లో ప్రశ్నించినా సమాధానం రావడం లేదని, దీంతో ప్రజా ఉద్యమమే శరణ్యమని భావించి ఇంకా నాలుగేండ్ల గడువున్నా రాజీనామా చేశానని తెలిపారు. చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల సాధనే తన జీవిత ధ్యేయమని, ఆ దిశగా పోరాటాలను ఉధృతం చేస్తానని చెప్పారు. రాజకీయ పార్టీ పెట్టాలని బీసీ బిడ్డల నుంచి వస్తున్న ఒత్తిడిపై కూలంకషంగా చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ పోరాటాల్లోకి రాజకీయాలకతీతంగా బీసీలంతా కదలిరావాలని కోరారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యతో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సైతం ఆర్ కృష్ణయ్యను కలిసి ఇదే విషయమై చర్చలు జరిపారు. సమావేశంలో బీసీ సంఘాల నేతల గుజ్జ కృష్ణ, మల్లేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.