హైదరాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): ప్రతిపాదిత హైబ్రిడ్ యాన్యూటీ మోడ్(హ్యామ్) విధానంలో భాగంగా రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం పనులు మాత్రమే చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు, రెన్యువల్స్ పనులను యథావిధిగా నిర్వహించాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. అంతేకాదు,. హ్యామ్ పనులకోసం కాంట్రాక్టర్లు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలని వారు డిమాండ్‌చేశారు.
హ్యామ్ రోడ్లపై కాంట్రాక్టర్లు, బ్యాంకర్లు, కన్సల్టెంట్లకు అవగాహన కల్పించేందుకు మంగళవారం న్యాక్‌లో రోడ్ షో నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు కాంట్రాక్టర్లు, వివిధ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేయించిన పనులకు బిల్లులు చెల్లించకుండా ప్రస్తుత ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి అవలంబిస్తున్నట్టు పలువురు కాంట్రాక్టర్లు అభిప్రాయపడ్డారు. దీనిపై మం త్రులు స్పందిస్తూ వచ్చే క్యాబినెట్లో తగిన నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు.