లింగాలఘనపురం, ఫిబ్రవరి 3: ఫస్ట్ ర్యాంక్ అభ్యర్థికి.. రెండో ర్యాంకు అభ్యర్థికి మార్కుల్లో భారీ వ్యత్యాసం ఉండటంతో ఫలితాలను నిలిపి వేయగా, కోర్టు ప్రతిభకే పట్టం కట్టింది. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం వడిచర్లకు చెందిన బేతి మల్లేశం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 2023 సెప్టెంబర్‌లో జూనియర్ లెక్చరర్ (జేఎల్) పరీక్ష రాయగా, 2024 జూలైలో ఫలితాలు వచ్చాయి. జీఆర్ఎల్ (జనరల్ ర్యాంకింగ్ లిస్ట్)లో మల్లేశంకు 450 మార్కులకు 406 సాధించాడు. తర్వాత రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి 308 మార్కులు వచ్చాయి. మొదటి, రెండో ర్యాంకుల అభ్యర్థుల మధ్యన భారీ వ్యత్యాసం ఉన్నదని టీఎస్పీఎస్సీ మల్లేశం ఫలితాన్ని విత్‌హెల్డ్‌లో పెట్టింది. దీన్ని సవాల్ చేస్తూ మల్లేశం న్యాయపోరాటం చేశారు. విచారణ అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జనవరి 31న టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ జనరల్ ర్యాంకింగ్ ఫలితాల్లో మల్లేశంకు మొదటి ర్యాంకును ప్రకటించారు.