హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): తాను బీజేపీలో చేరడం లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం ఆమె బీజేపీ రాష్ట్ర కార్యా లయానికి వచ్చి పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు ఇటీవల ఢిల్లీకి వెళ్లి కలిసినట్టు స్పష్టత ఇచ్చారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ నేతలను కలిసి చర్చించినట్టు వివరించారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని తెలిపారు. తాము బీఆర్ఎస్లో కొనసాగుతామని స్పష్టంచేశారు.