దుబ్బాక, మార్చి 26 : తలాపున మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఉన్నా దుబ్బాక రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు, కూడవెల్లి వాగు మండుటెండల్లో సైతం జలకళ ఉట్టిపడి పంటలు పండాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగు భూములు సైతం బీడు బారుతున్నాయి. చెరువులు, కుంటల్లో నీరులేక ఎడారిని తలపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగునీరందక చేతికొచ్చే సమయంలో వరి పంటలు ఎండిపోతున్నాయి. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి కూడవెల్లి వాగులోకి సకాలంలో సాగునీరు విడుదల చేయలేదు. దీంతోపాటు 4ఎల్ డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం పూర్తికాక పోవడంతో రైతులు సాగునీటి కష్టాలు ఎదురయ్యాయి.
నీరందక ఎండిన వరి పొలాలను రైతులు పశువులకు మేతకు వదిలేస్తున్నారు. ఏ పొలం చూసినా నెర్రెలిడి కనిపిస్తున్నాయి. దుబ్బాక మండలం రామక్కపేట, రఘోత్తంపల్లి గ్రామాల్లో బుధవారం ‘నమస్తే తెలంగాణ’ ఫీల్డ్ విజిట్ చేసింది. నీరులేక పొట్టదశకు వచ్చిన వరి పంటలు ఎండిపోతుండటం కనిపించింది. పంటలను కాపాడుకునేందుకు రైతులు అప్పులు చేసి బోర్లు తవ్విస్తున్నా చుక్కనీరు రావడం లేదు. ఈ రెండు గ్రామాల్లో నెల రోజుల్లో 400 బోరుబావులు తవ్వించినట్టు తెలిసింది. వీటిలో 90 శాతం బోరుబావుల్లో చుక్కనీరు పడలేదు. చెరువులు నీరులేక బోసిపోయాయి. గతేడాది యాసంగితో పోల్చితే ఈ సారి తక్కువ విస్తీర్ణంలో వరి సాగుచేసినప్పటికీ నీరందక ఎండిపోతున్నాయి. దుబ్బాక మండలం ఆకారం సెక్టార్లో ఈ యాసంగిలో 3,140 ఎకరాల వరి సాగు చేయగా, ఇందులో 40 శాతం పంట ఎండిపోయింది.
నాకు ఐదెకరాల భూమి ఉన్నది. 3 ఎకరాల్లో వరి వేసిన. బోరు పోయక పంట ఎండిపోతుండటంతో నెల రోజుల కిందట ఐదు బోర్లు వేయించినా చుక్క నీరు పడలేదు. 800 ఫీట్లకుపైగా బోరు తవ్వించినా తడి రాలేదు. మళ్లీ వారం తర్వాత మరో ఐదు బోర్లు తవ్వించిన. చివరి పదో బోరుకు 650 ఫీట్లకు నీరు వచ్చింది. రూ.7 లక్షల ఖర్చు పెట్టి పది బోర్లు తవ్వించిన. నా జీవితంలో పంటల సాగుకోసం ఎన్నడు ఇంత కష్టపడలేదు. ఇంత ఖర్చుకాలేదు.