తొగుట, సెప్టెంబర్ 5: ‘వావ్ సూపర్.. చాలా బాగుంది.. ఇండియాలో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు ఉన్నది అంటే చూసేదాక నమ్మలేక పోయాం’ అని మల్లన్న సాగర్‌ను సందర్శించిన విదేశీ ప్రతినిధులు మెచ్చుకున్నారు. పర్యావరణ ప్రభావం అంశంపై అంతర్జాతీయ శిక్షణలో భాగంగా 13 దేశాలకు చెందిన ప్రతినిధులు 30 మంది మంగళవారం సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. పంప్‌హౌస్, డెలివరీ చానల్, మల్లన్న సాగర్ కట్టను పరిశీలించారు. భూగర్భంలో ఇంత పెద్ద కట్టడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా డీఈ శ్రీనివాస్ వారికి ప్రాజెక్టు గురించి వివరించారు. 2004 పూర్వం తెలంగాణలో 1.72 కోట్ల ఎకరాల సాగుకు అనుకూలమైన భూమి ఉండగా, ఆ సమయంలో కేవలం 45 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేదని తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు తరువాత వ్యవసాయాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేసినట్టు పేర్కొన్నారు. గోదావరిపై ఇతర రాష్ర్టాల్లో ఎక్కువ ప్రాజెక్టులు నిర్మించడంతో అనుకున్నంత నీటి లభ్యత లేదని, ప్రాణహిత గోదావరిలో కలిసే ప్రాంతంలో మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్టు చెప్పారు. అక్కడి నుంచి 200 కిలోమీటర్ల దూరం, 88 మీటర్ల ఎత్తు నుంచి 530 మీటర్ల ఎత్తు వరకు 10 లిప్టులు, రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌ల ద్వారా మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి నీటిని తీసుకురావడం జరిగిందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 46,500 చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా పునరుద్ధరించుకోవడం జరిగిందని అన్నారు. గతంలో 45 లక్షల ఎకరాలు సాగైతే నేడు 90 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు.
గతంలో 50 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి నుంచి నేడు 2.60 లక్షల టన్నుల వరి ధాన్యానికి చేరుకున్నట్టు చెప్పారు. దేశంలోనే వరి ధాన్యం ఎక్కువ శాతం పండించిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని ఆయన వెల్లడించారు. కేంద్రంలోని నీతి ఆయోగ్ కూడా తెలంగాణలో 2014లో 13.1 ఉన్న పేదరికం నేడు 5.6 శాతానికి పడిపోయినట్టు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎత్తిపోతల ద్వారా పంట పొలాలకు సాగు నీరు అందించే కార్యక్రమం తెలంగాణలో మాత్రమే ఉన్నదని, ఆ ఘనత సీఎం కేసీఆర్‌దేనని విదేశీ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను మెచ్చుకున్నారు. తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.