దుండిగల్, మార్చి 6 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలోని మల్లారెడ్డి నారాయణ మల్టీస్పెషాలిటీ వైద్యశాలలో గురువారం నుంచి రోబోటిక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎస్ఎస్ఐ మంత్ర 3.o పేరిట ఏర్పాటుచేసిన సేవలను మల్లారెడ్డి విశ్వవిద్యాలయం చాన్స్లర్ కల్పనారెడ్డి, మల్లారెడ్డి వైద్యశాలల చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా భద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలి రోబోటిక్ శస్త్రచికిత్స వ్యవస్థను తమ వైద్యశాలలో ప్రవేశపెట్టడం గర్వంగా ఉందని తెలిపారు. రోబోటిక్ సర్జరీతో రోగి వేగంగా కోలుకునే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ఇక్కడి ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు.
ప్రీతిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్ విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అత్యంత అధునాత రోబోటిక్ వ్యవస్థ ఎస్ఎస్ఐ మంత్ర 3.o సేవలను మొదటిసారిగా మల్లారెడ్డి నారాయణ వైద్యశాలలో ఏర్పాటుచేయడం సంతోషకరంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు.