హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘వారసత్వ రాజకీయాలు దేశానికి ప్రమాదకరం. కుటుంబపాలన, పరివార్వాద్ సంస్కృతిని అంతమొందించాలి.’ ఇవీ తరుచూ బీజేపీ, కాంగ్రెస్ నేతల నోట వినిపించిన నినాదాలు. వారసత్వ రాజకీయాలకు తామూ అతీతం ఏమీ కాదని టికెట్ల పంపిణీ మరోసారి రుజువుచేసింది. బీజేపీ పుత్రరత్నాలకు టికెట్లు ఇవ్వగా.. ఒక కుటుంబానికి ఒకే టికెట్ కేటాయించాలన్న ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కింది. 4 కుటుంబాలకు రెండేసి టికెట్లిచ్చింది. మొదటి జాబితాలోనే ఉత్తమ్, ఆయన సతీమణి పద్మావతికి హుజూర్నగర్, కోదాడ టికెట్లు కట్టబెట్టింది.
మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజిగిరి, ఆయన తనయుడు రోహిత్‌రావు మెదక్ టికెట్లు కేటాయించింది. మాజీ కేంద్ర మంత్రి జీ వెంకటస్వామి తనయులిద్దరూ టికెట్లు దక్కించుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నల్లగొండ, ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు టికెట్లు ఇచ్చింది.
జానారెడ్డి కుమారుడు జయవీర్‌రెడ్డికి నాగార్జునసాగర్ టికెట్, మాజీ ఎంపీ రాజేశ్వర్‌రావు మనుమడు వొడితెల ప్రణవ్బాబుకు హుజురాబాద్, సీఎల్పీ మాజీ నేత పీజేఆర్ కూతురు విజయారెడ్డికి ఖైరతాబాద్, మాజీ మంత్రి చిట్టెం నర్సిరెడ్డి సమీప బంధువు చిట్టెం పర్నికరెడ్డికి నారాయణపేట, మాజీ మంత్రి రత్నాకర్‌రావు తనయుడు నర్సింగరావుకు కోరుట్ల, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు డాక్టర్ రాజేశ్‌రెడ్డికి నాగర్‌కర్నూల్ టికెట్లు ఇచ్చి వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేసింది.
బీజేపీ సైతం అనేక నియోజకవర్గాల్లో పుత్రరత్నాలకే టికెట్లు ఇచ్చింది. మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డికి మహబూబ్‌నగర్ టికెట్‌ను కేటాయించింది. కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు తనయుడు వికాస్‌రావుకు వేములవాడ, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోడలు కీర్తిరెడ్డికి భూపాలపల్లి, శేరిలింగంపల్లిలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ కొడుకు రవికుమార్‌యాదవ్‌కు, సిర్పూరులో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు హరీశ్‌కు, మంథనిలో మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి తనయుడు సునీల్‌కు, ములుగులో మాజీ మంత్రి చందులాల్ తనయుడు ప్రహ్లాద్‌కు, సనత్‌నగర్‌లో మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్‌రెడ్డికి టికెట్లు కేటాయించింది.