ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 3: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు మాలలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిపై వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన కింద కేసులు నమోదయ్యాయి. వీరి తీరుపై మాల సంఘాల ఆధ్వర్యంలో పలుచోట్ల ఆందోళనలు నిర్వహించి వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్‌లో ఆదివారం రాత్రి ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఈసీ శేఖర్‌గౌడ్, తుర్కయంజాల్ మున్సిపల్ వైస్ చైర్మన్ హరితాధన్‌రాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో హాత్‌సే హాత్ జోడోయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఈసీ శేఖర్‌గౌడ్ మాలలు, వెలమలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదే సమావేశంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయకపోగా… నవ్వుతూ శేఖర్‌గౌడ్‌ను ప్రోత్సహించారని మాల సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బుగ్గరాములు, కౌన్సిలర్ బర్తాకి జగన్ పలు మాలసంఘాల ఆధ్వర్యంలో ఈసీ శేఖర్‌గౌడ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ బర్తాకి జగన్ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ శేఖర్‌గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.