హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బోధనా వైద్యుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను తెలంగాణ ప్రభుత్వ బోధన వైద్యుల సంఘం (టీటీజీడీఏ) కోరింది. సంఘం ప్రతినిధులు మంగళవారం మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఒకేచోట ఐదేండ్లకుపైగా పనిచేస్తున్నవారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
హైదరాబాద్‌లో ఏండ్లుగా ఉంటున్నవారిని బదిలీ చేసి, కొత్తవారికి అవకాశం కల్పించాలని, అన్ని రకాల పదోన్నతులను కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించాలని తెలిపారు. హార్డ్‌షిప్ అలవెన్స్‌ను గిరిజన, గ్రామీణ ప్రాంతాలకు వర్తింపజేయాలని పేర్కొన్నారు. ఈ విషయాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొల్లేపాక కిరణ్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల, ఉపాధ్యక్షుడు డాక్టర్ కిరణ్ ప్రకాష్, కోశాధికారి డాక్టర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.