హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సెలవు పెట్టకుండా విధులకు ఏడాదిపాటు గైర్హాజరైతే ఉద్యోగం నుంచి తొలగించనున్నారు. సర్వీసు రూల్స్ సవరించారు. సెలవు తీసుకున్నా.. తీసుకోకున్నా ఐదేండ్లపాటు విధులకు గైర్హాజరైతే, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఫారిన్ సర్వీస్ గడువు దాటిన తర్వాత కూడా విధుల్లో చేరకుంటే ఉద్యోగం నుంచి తొలగించనున్నారు. ఫారిన్ సర్వీసుపై వెళ్లే అధికారులు గడువు ముగిసిన తర్వాత కూడా విధులకు గైర్హాజరైతే షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రిపబ్లిక్ డే సందర్భంగా 2026 జనవరి 26న నిర్వహించనున్న ప్రత్యేక గ్రామసభల్లో ఈ ‘సభా సార్’ ప్లాట్‌ఫామ్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవో) తమ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ‘సభా సార్’ వినియోగంపై ఆదేశాలు జారీ చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ శృతి ఓఝా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ గ్రామ సభల డాక్యుమెంటేషన్‌ను డిజిటల్‌గా మార్చేందుకు ‘సభా సార్’ అనే ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను గత ఏడాది ఆగస్టు 14న ప్రవేశపెట్టింది.
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 166 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల పరిధిలోని ఆరు జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీ-పోల్ సాఫ్ట్వేర్ ద్వారా పోలింగ్స్టేషన్లవారీగా ఓటర్ల జాబితా మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈసీ కార్యదర్శి లింగ్యానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.