ఆదివారం 07 మార్చి 2021
Telangana - Dec 19, 2020 , 00:46:41

మజ్లిస్‌ నేత కాల్పులు

మజ్లిస్‌ నేత కాల్పులు

  • నడిరోడ్డుపై రివాల్వర్‌తో వీరంగం  
  •  ముగ్గురికి గాయాలు
  • ఆదిలాబాద్‌లో కలకలం

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయం త్రం ఓ మజ్లిస్‌ నేత రివాల్వర్‌తో కాల్పులు జరిపి వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓఎస్డీ రాజేశ్‌చంద్ర కథనం ప్రకారం.. పట్టణంలోని తాటిగూడ ప్రాంతంలో పిల్లలు క్రికెట్‌ ఆడుతుండగా గొడవ జరిగింది. ఆ సమయంలో పిల్లల తల్లిదండ్రులు బయటకు వచ్చారు. వారి మధ్య మాటామాటా పెరగడంతో కోపొద్రిక్తుడైన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ తన ఇంట్లోకి వెళ్లి.. లైసెన్స్‌ రివాల్వర్‌ తోపాటు కత్తిని తీసుకువచ్చాడు. సయ్యద్‌ మన్నాన్‌, సయ్యద్‌ జమీర్‌, సయ్యద్‌ మోతెశాంలపై దాడికి పాల్పడ్డాడు. సయ్యద్‌ మోతెశాం నడుముకింది భాగంలో ఒక బుల్లెట్‌, సయ్యద్‌ జమీర్‌కు కడుపు, వీపులో రెండు బుల్లెట్లు తగిలాయి. సయ్యద్‌ మన్నాన్‌ తలపై కత్తితో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు. దాడి సమాచారాన్ని తెలుసుకున్న టూటౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను రిమ్స్‌ దవాఖానకు తరలించారు. ఫారూఖ్‌ను అదుపులోకి తీసుకొని కత్తి, రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫారూఖ్‌పై ఐపీసీ 307, భారత ఆయుధాల చట్టం 27/30 కేసు నమోదు చేసి, నిందితుడిని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్టు ఓఎస్డీ రాజేశ్‌ చంద్ర తెలిపారు. బుల్లెట్‌ గాయాలైన ఇద్దరిని హైదరాబాద్‌కు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న వారిని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, జెడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ పరామర్శించారు.

VIDEOS

logo