వేల్పూర్, సెప్టెంబర్ 25: మక్క కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మక్కజొన్న రైతులు పడుతున్న కష్టాలను తీర్చే బాధ్యత రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపైనే ఉన్నదని సూచించారు. మక్కలకు ప్రైవేట్ వ్యాపారులు క్వాంటాకు రూ.1,800 కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో మక్కజొన్నను నిల్వ చేసే పరిస్థితి లేక, తడిసిపోయే ప్రమాదం ఉండటంతో రైతులు దిక్కులేక దళారులకు అమ్మేకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అన్ని పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. హామీని అమలుచేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.2,800లకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సోయా కూడా చేతికొస్తున్నదని, ప్రభుత్వం ఇప్పటి నుంచే పంట కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.