హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ డ్యామ్‌పై నవంబర్ 28వ తేదీకి ముందున్న రీతిలో యథాతథస్థితిని కొనసాగేలా చూడాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం మరోసారి లేఖ రాశారు. సాగర్ డ్యామ్‌ను ఏపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆక్రమించడంతో విషయాన్ని వెంటనే ప్రభుత్వం కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది. కేంద్ర హోంశాఖ సైతం తక్షణమే స్పందించి డ్యామ్ ఆక్రమణను తొలగించి పూర్వపుస్థితిని పునరుద్ధరించాలని ఇరు రాష్ర్టాలకు సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ తాజాగా మరోసారి కేఆర్ఎంబీకి లేఖ రాసింది. డ్యామ్ కంట్రోల్‌ను తెలంగాణకు అప్పగించి, పూర్వస్థితిని కొనసాగించేలా సత్వరమే చర్యలు చేపట్టాలని కోరింది.