హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయనకు రవాణా, హౌసింగ్, జీఏడీ (కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, స్మార్ట్ గవర్నెన్స్)బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలలుగా వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి మహేశ్‌దత్ ఎక్కాకు జీఏడీ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడేనాటికి ఎంసీఆర్‌హెచ్చార్డీ డీజీగా ఉన్న ఆయనను ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో భూగర్భ, గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది.
అనంతరం మేలో జరిపిన బదిలీల్లో జీఏడీకి అటాచ్ చేసింది. హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికగుప్తాను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా నియమించింది. వీరితోపాటు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ శరత్‌కు ఆ శాఖ కమిషనర్‌గా, స్పోర్ట్స్ డైరెక్టర్‌గా ఉన్న కొర్ర లక్ష్మికి గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీగా, ఆర్అండ్ బీ శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న ఎస్ హరీశ్‌కు విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది.