భూత్పూర్, మే 24: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి గొప్పస్థాయిలో తిరిగి వస్తాడనుకున్న కన్నకొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మంగళవారం రాత్రి అమెరికా (మిన్నెసోటా)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండల యువకుడు మహేశ్(25) దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కప్పెట గ్రామానికి చెందిన బోయ వెంకట్రాములు, శకుంతలకు ఇద్దరు కుమారులు.
పెద్ద కొడుకు మహేశ్ అమెరికాలో ఎంఎస్ పూర్తి చేయడానికి గతేడాది డిసెంబర్ 29న వెళ్లాడు. అక్కడ మహేశ్‌తో పాటు మరో ముగ్గురు (శివ, శ్రీలత, భరత్)కలిసి స్నేహితుడి జన్మదిన వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం రాత్రి 11 గంటలకు ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. మహేశ్ మృతదేహాన్ని ఇండియాకు తెచ్చేందుకు కుటుంబసభ్యులు, బంధువులు వైస్ ఎంపీపీ నరేశ్గౌడ్తో కలిసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని సంప్రదించారు. ఇందుకు ఎమ్మెల్యే అమెరికాలోని ఆటా సభ్యులతో మాట్లాడి మృతుడి వివరాలను తెలిపారు.