మహబూబాబాద్, సెప్టెంబర్ 29: మూడేండ్ల క్రితం మహబూబాబాద్‌లో సంచలనం సృష్టించిన తొమ్మిదేండ్ల బాలుడి దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. నిందితుడు మంద సాగర్‌కు మహబూబాబాద్ జిల్లా కోర్టు శుక్రవారం ఉరిశిక్ష విధించింది. నిందితుడు 2020 అక్టోర్ 18న మహబూబాబాద్‌కు చెందిన కుసుమ రంజిత్‌రెడ్డి-వసంత కుమారుడు దీక్షిత్(9)ను కిడ్నాప్ చేసి, తాళ్లపూసపల్లి శివారు గుట్టల్లో పాశవికంగా హత్యచేశాడు. అదేరోజు రంజిత్‌రెడ్డికి నిందితుడు ఇంటర్నెట్ కాల్ చేసి రూ.45 లక్షలు ఇస్తే బాలుడిని వదిలేస్తానని చెప్పి, ఈ దారుణానికి ఒడిగట్టాడు. దాదాపు మూడేండ్లపాటు కేసు విచారణ సాగింది.
పూర్వాపరాలను పరిశీలించిన జడ్జి చంద్రశేఖరప్రసాద్ దోషిగా తేలిన సాగర్‌కు ఉరి శిక్ష విధిస్తూ శుక్రవారం తుది తీర్పు వెలువరించారు. కోర్టు తీర్పుపై బాధిత మృతుడి రంజిత్‌రెడ్డి-వసంత, పట్టణవాసులు హర్షం వ్యక్తంచేశారు. కోర్టు, ఠాణా ఎదుట పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. న్యాయదేవత ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ తీర్పుతో నేరస్తులకు కనువిప్పు కలుగుతుందని, నేరం చేయాలంటేనే భయకంపితులయ్యేలా న్యాయమూర్తి తీర్పును వెల్లడించారని మహబూబాబాద్ ఎస్పీ చంద్రమోహన్ పేర్కొన్నారు. ఈ తీర్పుతో న్యాయస్థానం, పోలీస్ వ్యవస్థలపై ప్రజలకు అపారమైన నమ్మకం, విశ్వాసం ఏర్పడిందని రంజిత్‌రెడ్డి-వసంత పేర్కొన్నారు. తమ కుమారుడిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్న కిరాతకుడికి న్యాయస్థానం తగిన శిక్ష వేసిందని హర్షం వ్యక్తం చేస్తూ న్యాయస్థానం గుర్తు, పోలీస్ సింబల్లకు క్షీరాభిషేకం చేసినట్టు చెప్పారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : దీక్షిత్ కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించడంతో పోలీసులు, న్యాయవ్యవస్థలపై ప్రజల్లో ధీమా పెరిగిందని డీజీపీ అంజనీకుమార్ ట్విటర్ ద్వారా చెప్పారు. నిందితుడు సాగర్‌కు ఉరిశిక్ష-మరణ శిక్ష విధించడం పట్ల.. ఆ బాలుడి కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న ధీమాను డీజీపీ వ్యక్తం చేశారు. సంచలనం సృష్టించిన అన్ని కేసుల్లో నేరస్తులకు శిక్షపడేందుకు తెలంగాణ పోలీసులు చిత్తశుద్ధితో విధినిర్వహణ చేసేందుకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. మహబూబాబాద్ ఎస్పీ చంద్రమోహన్ ఆధ్వర్యంలోని పోలీసు సిబ్బందికి డీజీపీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.