గన్నేరువరం, సెప్టెంబర్15: విద్యార్థులకు వడ్డించే అన్నంలో పురుగులు వస్తున్నాయని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి స్టేజీ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాల ఎదుట సీపీఐ నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆదివారం ఆందోళన చేశారు. 400 మంది బాలికలు ఉన్న ఈ పాఠశాలలో సమస్యలు పట్టించుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారని సీపీఐ మండల సహాయ కార్యదర్శి చుకల్ల శ్రీశైలం ప్రశ్నించారు. పురుగుల అన్నం తింటే తమ పిల్లల ఆరోగ్యం ఏం కావాలని తల్లిదండ్రులు మండిపడ్డారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు అధ్వానంగా ఉన్నాయన్నారు. ఘటనపై ప్రిన్సిపాల్ నవీనను సంప్రదించగా.. రోజూ కూరగాయలు, బియ్యం శుభ్రం చేశాకే వంటచేస్తున్నట్టు తెలిపారు. ఇకముందు పురుగులు రాకుండా చూస్తామన్నారు.
ఇంట్లోకి చొరబడి పుస్తెలతాడు చోరీ
సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగిన చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు కూరగాయలు కోస్తున్న వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెలతాడు లాక్కొని బైక్‌పై పరారయ్యాడు. తంగళ్లపల్లిలోని మార్కండేయ ఆలయం పక్కన ఒంటరిగా నివాసం ఉండే సబ్బని రుక్కుంబాయి (70) తన ఇంట్లో దర్వాజ వద్ద కూర్చుని వంట కోసం కూరగాయలు కోస్తున్నది. ఓ ఆగంతకుడు ఇంట్లోకి చొరబడి రుక్కుంబాయి మెడలో నుంచి పుస్తెలతాడును లాక్కెళ్లి వీధి సమీపంలో పార్కింగ్ చేసిన బైక్‌పై పరారయ్యాడు. వృద్ధురాలు బయటకు వచ్చి కేకలు వేయగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించా రు. క్లూస్‌టీం, పోలీసు జాగిలంతో గాలించారు. డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై సుధాకర్ మండల కేంద్రంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.