హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ దూకుడు కొనసాగుతున్నది. నిత్యం ఇతర పార్టీలు, సంఘాలలోని రాష్ట్ర స్థాయి నేతల నుంచి కార్యకర్తల వరకు వేలమంది బీఆర్ఎస్ కండువాలు కప్పుకొంటున్నారు. నాందేడ్ నుంచి మొదలైన చేరికలు ఔరంగబాద్ వరకు చేరాయి. తాజాగా ఎన్సీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మహారాష్ట్రలో కీలక మైనార్టీ నేత సయ్యద్ అబ్దుల్ ఖదీర్ బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదివారం అబ్దుల్ ఖదీర్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఖదీర్తోపాటు పలువురు ముఖ్య నేతలు బీఆర్ఎస్లో చేరారు. శనివారం కూడా మహారాష్ట్ర రైతు సంఘాల నేతల భారీగా బీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. ఈ చేరికలు జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
తెలంగాణ మైనార్టీ మాడల్ మాకూ కావాలి: ఖదీర్
తెలంగాణలో అమలవుతున్న మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు మహారాష్ట్రలోనూ అమలుకావాలన్నదే తమ కోరిక అని అబ్దుల్ ఖదీర్ అన్నారు. సీఎం కేసీఆర్ అద్భుత పథకాలు అమలుచేస్తున్నారని కొనియాడారు. షాదీముబారక్ మహారాష్ట్రలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. మైనార్టీ విద్యార్థులకు గురుకులాలు, రంజాన్ తోఫా, రంజాన్ విందు లాంటివి మైనార్టీల్లో ఆత్మవిశ్వాసం నింపుతాయని అన్నారు. వీటిని అమలు చేయడానికి బీఆర్ఎస్ అక్కడ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతో ఉన్నదని తెలిపారు.
మహారాష్ట్రలో 20 శాతం ముస్లింలు ఉన్నా, వారి కోసం ఏ రాజకీయ పార్టీ సరైన కార్యక్రమాలు అమలు చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఔరంగాబాద్‌లో పర్యటించాలని సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించినట్టు ఖదీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఏ జీవన్‌రెడ్డి, రైతు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే, వైజాపూర్ విధానసభ నియోజకవర్గ నాయకుడు అభయ్ పాటిల్, చికగాంకర్ సాహెబ్, దళిత యువజన నాయకుడు ఏవిన్ష్ వస్మత్, ప్రహ్లాద్ రాఖోండే సాహెబ్, గోరఖ్ పాటిల్, శ్యామ్ కదమ్, గోవింద్ థెంబారే, దేవానంద్ పాటిల్, తుకారాం సాల్వే, చంద్రవిలాస్ తొంబరే పాటిల్, గజానన్ కదమ్,సంతోష్ పాటిల్, ప్రవీణ్ జెతెవాడ్ తదితరులు పాల్గొన్నారు.

Cm
మహారాష్ట్ర మైనార్టీల్లో పట్టున్న నేత ఖదీర్
సయ్యద్ అబ్దుల్ ఖదీర్ మౌలానా ఎన్సీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎన్సీపీలో అనేక పదవులు చేపట్టారు. మైనార్టీల్లో మంచి పట్టున్న నేతగా ఖదీర్‌కు గుర్తింపు ఉన్నది. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్‌గా 2000-2005 వరకు పనిచేశారు. 2001-2008 వరకు ఎన్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇదే సమయంలో ఎన్సీపీ పార్లమెంట్ బోర్డు సభ్యుడిగా, రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఎన్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009లో ఔరంగాబాద్ ఎమ్మెల్యేగా ఎన్సీపీ తరఫున పోటీ చేశారు. ఎన్సీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయన, ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఔరంగబాద్ డీపీడీసీ సభ్యుడిగా రెండు సార్లు పనిచేశారు. 2019లో ఔరంగాబాద్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు.