హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ సర్కారు ఏర్పడితే తెలంగాణ మాడల్ అమలు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దేశంలో కిసాన్ సరార్ స్థాపనకోసం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. శుక్రవారం మహారాష్ట్రకు చెందిన పలువురు ప్రముఖులు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన జనతాపార్టీ లాతూర్ జిల్లా అధ్యక్షుడు జయసింగ్ యాదవ్, లాతూర్ జిల్లా సంఘటన నేత వోన్రాజ్ రాథోడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్జున్ రాథోడ్, భగవంత్ కులకర్ణికి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సర్కారు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపాయని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాల సుమన్, జయంత్ దేశ్‌ముఖ్ తదితరులు ఉన్నారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపులో తాము కూడా పాల్గొన్నామని, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ చేసిన పోరాటాన్ని తెలుసుకొన్నామని మహారాష్ట్ర నేతలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత స్వయం పాలనలో కూడా అదే ఉద్యమ స్పూర్తిని కొనసాగించడంవల్లే ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. తెలంగాణలో రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి బాటపట్టించిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర అభ్యున్నతి, దేశ రైతాంగం కోసం కూడా అదే పోరాటపటిమను ప్రదర్శిస్తారనే విశ్వాసం తమకు ఉన్నదని పేర్కొన్నారు.