యాదాద్రి, ఫిబ్రవరి 21 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ పునఃప్రారంభోత్సవంలో భాగంగా మార్చి 28న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలను యాథావిధిగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. సోమవారం ఆమె మీడియా మాట్లాడుతూ.. ఆలయ పునఃప్రారంభోత్సవం సందర్భంగా మార్చి 21 నుంచి బాలాలయంలో యజ్ఞ, హోమాలు, వివిధ రకాల పూజలు నిర్వహిస్తామని తెలిపారు. కొండ కింద వసతుల కల్పన, యాగశాల పనులు పూర్తికానందున కొండ కింద యాగస్థలిలో నిర్వహించాల్సిన మహా సుదర్శన నారసింహ యాగాన్ని వాయిదా వేసినట్టు చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణకు మహా సుదర్శన నారసింహ యాగానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. మార్చి 28 వరకు బాలాలయంలో స్వామివారి దర్శనాలు కొనసాగుతాయని, అనంతరం బాలాలయంలో నెలకొల్పిన కవచమూర్తులను ప్రధానాలయానికి తరలిస్తామని, ఆ తరువాత బాలాలయాన్ని మూసివేయనున్నట్టు ఆమె స్పష్టం చేశారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2022 వార్షిక బ్రహ్మోత్సవాలను మార్చి 4 నుంచి 14వ తేదీ వరకు 11 రోజులపాటు నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ గీత తెలిపారు. ఈ ఉత్సవాలను స్వామివారి బాలాలయంలో ఆంతరంగికంగా నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.
యాదాద్రి, ఫిబ్రవరి 21 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ దివ్య విమాన గోపురం స్వర్ణతాపడానికి దాతల నుంచి విరాళాలు వస్తున్నాయి. సోమవారం హైదరాబాద్ నాగోల్‌కు చెందిన ఎం భరత్‌రెడ్డి – సావిత్రి దంపతులు రూ.51,116 విరాళం సమర్పించారు. ఈ మేరకు ఆలయ ఈఓ ఎన్ గీతకు చెక్కును అందజేశారు.