హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ విరమణ పొందితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందవు. రిటైరయ్యామని ఆడబిడ్డలకో.. తోబుట్టువులకో తృణమో.. ఫలమో పెడదామంటే చేతిలో డబ్బులుండవు. జీపీఎఫ్‌లో డబ్బులుంటాయి కానీ, తీసుకోవడానికి వీల్లేదు. షుగర్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలనేకం. మందులు కొందామంటే.. టెస్టులు చేయించుకుందామంటే చిల్లిగవ్వ ఉండదు. ఇదీ రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యగులు, పెన్షనర్లు అనుభవిస్తున్న నరకయాతన. ఈ నేపథ్యంలో పెన్షనర్లు పోరుబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన దాదాపు 40 పెన్షనర్ల సంఘాలు ఏకమయ్యాయి. సంఘాలు, జేఏసీలు అన్నీ కలిసి ‘తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల సంఘాల సమన్వయ కమిటీ’గా ఏర్పడ్డాయి. ఈ కమిటీ సోమవారం చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. సోమవారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాను నిర్వహించనున్నారు. వేలాది మందితోఇందిరాపార్క్లో కదం తొక్కుతామని, సర్కారుకు తమ సత్తాచూపుతామని సమన్వయ కమిటీ నేతలు హెచ్చరించారు.
ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కాక మోసం చేసిందని పెన్షనర్లు ఆరోపిస్తున్నారు. మార్పు.. మార్పు అంటే కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఏం లేదని మండిపడుతున్నారు. ‘ఉచిత పథకాలిచ్చి డబ్బులన్నీ వృథా చేస్తున్నారు. ఈ ఉచితాలను అర్హులకిస్తున్నారా? అంటే అదీ లేదు. అనర్హులకు ఇచ్చి రూ.కోట్లకు కోట్లు వృథా చేస్తున్నారు. అసలు మిమ్మల్ని ఉచిత పథకాలివ్వమన్నదెవరు?’ అని జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జీతాలు, డీఏలు, పీఆర్సీలకేమో పైసలుండవు. కానీ, ఉచితాలకు డబ్బులుంటాయా? అని నిలదీస్తున్నారు. ‘ఒకవైపు ద్రవ్యోల్బణం పెరిగింది. ధరలు పెరుగుతున్నాయి. మేం నరకయాతన అనుభవవిస్తున్నాం. మేం దాచుకున్న డబ్బులు మాకిచ్చేందుకు కూడా ఇంత రాద్ధాంతమా?’ అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘సర్కారు పెద్దలు, మంత్రులు విలాసవంతమైన జీవితం గడపడంలేదా? మంత్రులు హెలికాప్టర్లలో తిరగడంలేదా? పైసల్లేవంటూనే దూబారా చేయట్లేదా?’ అని మండిపడుతున్నారు.
ఉద్యోగుల డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శిస్తున్నది. కడుపున పెట్టుకుని కాపాడాల్సిన తల్లే దయ్యమై పట్టినట్టుగా మా పరిస్థితి తయారైంది. పెన్షనర్లు, ఉద్యోగులకు కనీసం హెల్త్‌కార్డులు ఇవ్వలేని పరిస్థితి దాపురించడం అత్యంత దారుణం. ఎన్నికలకు ముందు అనేక హామీలివ్వలేదా? మ్యానిఫెస్టోలో పెట్టలేదా? కోసుకు తిన్నా రూపాయిలేదనడం దుర్మార్గం. మేమేమైనా నరరూప రాక్షసులమా? మేమైనా అదనంగా ఆస్తులడిగామా? సీఎం, మంత్రుల ఆస్తుల్లో వాటాలడిగామా? ఉద్యోగులు, పెన్షనర్లకు పోరాటాలు కొత్తకాదు.
రాష్ట్రసాధన ఉద్యమంలో ఉద్యోగులంతా పులులై గర్జించలేదా? వివక్షను ఎదురించలేదా? జీవో-610 అమలుకు, రాష్ట్రసాధనకు తెగించి కొట్లాడలేదా? ఉమ్మడి రాష్ట్ర సర్కారుపై సమరశంఖం పూరించలేదా? సకలజనుల సమ్మె, అసెంబ్లీ ముట్టడి, సంసద్‌యాత్ర, సాగరహారాలను విజయవంతం చేయలేదా? మళ్లీ ఇప్పుడు డీఏలు, పీఆర్సీల కోసం పులుల్లా గర్జిస్తాం. గతంలో తెలంగాణ వ్యతిరేకులతో పోరాడాం. రాష్ట్రం వచ్చాక మళ్లీ మనోళ్లతోనే పోరాటం చేయాల్సి రావడం అత్యంత దౌర్భాగ్యం. దురదృష్టకరం.
– చోళ ఓంప్రకాశ్
పెన్షనర్ల సమస్యలను సర్కారు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతున్నాం. సర్కారుకు కనీసం మాతో చర్చించే సమయం లేకపోవడం దారుణం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు లక్షల మంది పెన్షనర్ల తడాఖా చూపిస్తాం. రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయంగా అందాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడంలేదు. పెన్షనర్ల జీపీఎఫ్ ఖాతాల్లోని డబ్బులను కూడా తీసుకోలేని దుస్థితి రావడం దారుణం. మా సొంత డబ్బులు మేం తీసుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి. రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం హైకోర్టుకు వెళ్లాల్సి రావడం కన్నా దౌర్భా గ్యం మరొకటి ఉండదు. మా డబ్బులపై, మేం దాచుకున్న సొమ్ములపై ప్రభుత్వ అజమాయిషీ ఏమిటి?
-కే లక్ష్మయ్య, పెన్షనర్స్ జేఏసీ చైర్మన్