చెన్నై, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తెలంగాణ బిడ్డ జస్టిస్ దేవరాజ్ నాగార్జున బుధవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా బుధవారం మద్రాస్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ కృష్ణకుమార్ అధ్యక్షతన ఇతర న్యాయమూర్తులంతా సమావేశమై జస్టిస్ నాగార్జునకు ఘనంగా వీడోలు పలికారు. ఆయన వెలువరించిన కీలక తీర్పులను ప్రస్తావిస్తూ.. న్యాయ వ్యవస్థకు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ నాగార్జున కుటుంబసభ్యులతోపాటు హైకోర్టు న్యాయాధికారులు, సీనియర్ న్యాయవాదులు, సిబ్బంది హాజరయ్యారు. 1962 ఆగస్టు 15న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో దేవరాజ్ రామకృష్ణారావు, విమలాదేవి దంపతులకు జన్మించిన నాగార్జున.. ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విద్య, వనపర్తిలోని ఆర్ఎల్డీ కాలేజీలో బీఎస్సీ, గుల్బర్గాలో లా, పీజీ డిప్లొమా, ఉస్మానియా వర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ లాలో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు.
జస్టిస్ నాగార్జున ప్రస్థానం ఇదీ..
1986లో న్యాయవాదిగా ఎన్రోల్ అయిన జస్టిస్ నాగార్జున.. తన తండ్రి రామకృష్ణారావు వద్ద జూనియర్‌గా న్యాయజీవితాన్ని ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ-కోర్టుల్లో పలు కేసులను సమర్థంగా వాదించారు. 1991 మే 1న జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన ఆయన.. 2004లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందే వరకు వివిధ ప్రాంతాల్లో పనిచేయడంతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీగా, ఏపీ పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా సేవలందించారు. కామారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పనిచేసిన జస్టిస్ నాగార్జున.. 2010 సెప్టెంబర్ 17న జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు.
2002 నుండి 2004 వరకు ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్‌లో పరిశోధన చేసిన జస్టిస్ నాగార్జునకు అమెరికా (బరిలీ)లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ప్రతిష్ఠాత్మక సాలర్షిప్ లభించింది. అదే సమయంలో జస్టిస్ నాగార్జున ఎల్ఎల్ఎం (ఇంటర్నేషనల్ లా), ఏషియన్ స్టడీస్‌లో ఎంఏ, 2013లో నల్సార్ యూనివర్సిటీ నుంచి ‘ఏ క్రిటికల్ అనాలిసిస్ అఫ్ ఇట్స్ ఇంపాక్ట్స్ ఆన్ ది ఇండియా లీగల్ ప్రొఫెషన్’ అనే అంశంపై పీహెచ్డీ చేశారు. 2015 అక్టోబర్ 3 నుంచి 2021 సెప్టెంబర్ 2 వరకు హైకోర్టు రిజిస్ట్రార్‌గా, ఆ తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా పనిచేసిన ఆయన.. 2022 మార్చి 24న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిరుడు ఏప్రిల్ 6న బదిలీపై మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు.