Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీపై మాదిగ సామాజికవర్గం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నది. తమకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని రగిలిపోతున్న ఆ సామాజికవర్గం అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నట్టు ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తమకు తీరని అన్యాయం చేసిందని, తమను కేవలం ఓటుబ్యాంకుగా వాడుకొని వదిలేస్తున్నదని ఎమ్మార్పీఎస్ అగ్రనేత మంద కృష్ణమాదిగ ఇప్పటికే పలుమార్లు ధ్వజమెత్తారు. నాగర్‌కర్నూల్‌లో మాదిగల సంఖ్య అధికంగా ఉన్నా, అన్ని సర్వేల్లో మాదిగలకే మొగ్గు ఉన్నా ఆ లోక్‌సభ టికెట్‌ను మాల సామాజికవర్గానికి కేటాయించటం వెనుక భారీ కుట్ర ఉన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ ఏకంగా రాహుల్ గాంధీకే లేఖ రాశారు. పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థికి తగిన గుణపాఠం తప్పదని మాదిగలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. రాష్ట్రంలోని జనాభా దామాషా ప్రకారం ఈ మూడింటిలో రెండు స్థానాలను మాదిగ సామాజిక వర్గానికి, ఒక స్థానాన్ని మాల సామాజికవర్గానికి కేటాయించటం ఆనవాయితీగా కొనసాగుతున్నది. దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ ఆ మూడు స్థానాలనూ మాలలకే కేటాయించటం మాదిగలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నది. దీంతో కాంగ్రెస్ పార్టీలోని మాదిగ సామాజికవర్గ నేతలు లేఖల ద్వారా తమ నిరసనను అధిష్టానానికి తెలియజేశారు. లోక్‌సభ సీట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం జరగడానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నేత కొప్పుల రాజు లాంటి వారే కారణమని వారు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్‌రెడ్డి సామాజికవర్గానికి ఒకనీతి మాదిగలకు మరో నీతా? అంటూ కృష్ణమాదిగ ప్రెస్‌క్లబ్ సాక్షిగా ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్‌రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఓడిపోయినా ఆయనకు నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చారని.. కానీ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో రెండుసార్లు ఓడిపోయిన సిరిపురం ఇందిరకు మాత్రం వరంగల్ టికెట్ ఇవ్వలేదని కృష్ణమాదిగ ఉదహరించారు. దీన్ని బట్టే మాదిగల పట్ల కాంగ్రెస్ ఎంత వివక్ష చూపుతున్నదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. వరంగల్ లోక్‌సభ టికెట్‌ను కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆ స్థానం లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ టి.రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, సిరిపురం ఇందిర, ఎంపీ పసునూరి దయాకర్ సరిపోరా? అని నిలదీశారు. అలాగే మాలల కంటే మాదిగల జనాభా అధికంగా ఉన్న నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌నే నమ్ముకొన్న సంపత్‌కు లేని అర్హత ఏమిటి? ఆ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లు రవికి ఉన్న అర్హతలేమిటి? అని మాదిగ సామాజికవర్గం నిప్పులు చెరుగుతున్నది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ది కుటుంబపాలన అంటూ విమర్శించిన సీఎం రేవంత్‌రెడ్డికి పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని ఎవరికి కేటాయించారో తెలియదా? అని కృష్ణమాదిగ ప్రశ్నించారు. ఇప్పటికే ఒకే కుటుంబానికి చెందిన గడ్డం వినోద్, గడ్డం వివేక్ వెంకటస్వామికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు మళ్లీ అదే కుటుంబంలోని వంశీకి లోక్‌సభ టికెట్‌ను కేటాయించడంపై మాదిగలు ఆగ్రహంతో ఉన్నట్టు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది.