హైదరాబాద్ : బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్ దుర్మార్గమని మండలి ప్రతిపక్ష నేత మధుసుదనాచారి అన్నారు. ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా న్యాయం, ధర్మం బీఆర్ఎస్ పక్షాన ఉందని పేర్కొన్నారు. తప్పుడు కేసులతో బీఆర్ఎస్ పోరాటాన్ని ఆపలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
కాగా, బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల జులుంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, పల్లె రవికుమార్ మండిపడ్డారు. ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మాపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగా లేదన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే అక్రమ అరెస్టులు ఏంటని ప్రశ్నించారు. పోలీసులు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
అలాగే బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను( Manne Krishank) పోలీసులు అరెస్టు చేశారు. ఈడీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా అదుపులోకి తీసుకున్నారు. ఈడీ కార్యాలయం వద్ద అరెస్టు చేసిన పలువురు బీఆర్ఎస్ నేతలను(BRS leaders) కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు(Kanchan Bagh Police Station) తరలించారు. వారిలో పల్లెరవికుమార్ గౌడ్, క్రిశాంక్, సుమిత్రానంద్, పావని గౌడ్, కీర్తిలత గౌడ్, తదితరులు ఉన్నారు.