హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నూతన అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని బాధ్యతలు స్వీకరించారు. లాస్ వేగాస్లోని ‘ది మిరాగ్’లో శనివారం జరిగిన ఆటా బోర్డు మీటింగ్‌లో ప్రస్తుత అధ్యక్షుడు భువనేశ్ బూజల కొత్త అధ్యక్షురాలికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా భవిష్యత్ లక్ష్యాలు, త్వరలో చేపట్టబోయే పనులు, ఆటా రోడ్ మ్యాప్ గురించి ఆమె మాట్లాడారు. యువతరాన్ని భాగస్వామ్యం చేయడం, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆటా కార్యకలాపాలు మరింత విస్తరించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడం, సేవా కార్యక్రమాలలో ఆటా భాగస్వామ్యాన్ని పెంచడం వంటివి విస్తృతంగా చేపడతామని వెల్లడించారు. ఆటా సభ్యులంతా నిబద్ధత, ఐక్యత, బాధ్యతతో సమాజ సేవలో ముందుండాలని కోరారు. నార్త్ కరోలినా ప్రాంతానికి చెందిన మధు బొమ్మినేని 2004 నుంచి ఆటాలో చురుగ్గా ఉండటంతోపాటు ఆటా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంటి అనేక పదవుల్లో సేవలందించారు. వచ్చే టర్మ్‌కు కాబోయే ప్రెసిడెంట్‌గా జయంత్ చల్లాను ఆటా బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. సమావేశానికి యూఎస్‌లోని అన్ని ప్రాంతాల ఆటా డైరెక్టర్లు, సలహాదారులు, మాజీ అధ్యక్షులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు.