శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2: ప్రిజం పబ్ కాల్పుల ఘటనలో 4 రాష్ర్టాల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న బత్తుల ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ఆదివారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో సైబరాబాద్ క్రైం డీసీపీ నర్సింహులుతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, సోమలధరి మండలం, వడ్డెపల్లి ఇరికిపెంట గ్రామానికి చెందిన బత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకర్‌రావు 2013లో తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలతో నేర వృత్తిని ప్రారంభించి, పేరొందిన ఇంజినీరింగ్ కళాశాలల్లో చోరీలకు పాల్పడే స్థాయికి చేరుకున్నాడు. చోరీ సొత్తుతో ఖరీదైన పబ్బులు, జిమ్‌లు, హోటళ్లకు తరచూ వెళుతూ విలాసవంతమైన జీవితానికి అలవాడుపడ్డాడు. 2020లో విశాఖపట్నం జిల్లాలో 57 చోరీ కేసుల్లో నిందితుడిగా అరెస్టయి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు సైతం వెళ్లాడు. 2022లో జైలు నుంచి తప్పించుకుని, నేరాలు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు 4 రాష్ర్టాల్లో 80కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉండి 28 కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు.
కొన్ని నెలలుగా గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని ఓ అపార్టుమెంట్లో స్నేహితుడి పేరుతో అద్దెకు తీసుకుని ఉంటున్న బత్తుల ప్రభాకర్‌పై నిఘాపెట్టిన మాదాపూర్ సీసీఎస్ పోలీసులు శనివారం ప్రిజం పబ్ దగ్గర అతడి కోసం కాపుకాసి పట్టుకునే ప్రయత్నించగా అతడు పోలీసులపైకి 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి ఎడమ కాలికి గాయమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని, 2 దేశవాళీ గన్లు, 23 రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ ఇంట్లో సోదాలు నిర్వహించిన మరో దేశవాళీ గన్, 451 రౌండ్ల బుల్లెట్లు, 3 సెల్ఫోన్లు, రూ. 62,000 నగదు, ఓ ఎలక్ట్రికల్ రాడ్కట్టర్, ఓ ఐరన్ రాడ్, ఎలక్ట్ట్రికల్ ఎక్స్టెన్షన్ బాక్సు, కటింగ్ బ్లేడ్లను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు తోటి ఖైదీకి ప్రభాకర్‌కు మధ్య వైరం ఏర్పడింది. జైలు నుంచి తప్పించుకొని ఆ ఖైదీ విడుదలయ్యాక చంపాలని ప్రభాకర్ భావించాడు. బిహార్ నుంచి గన్లు, బుల్లెట్లు కొనుగోలు చేశాడని డీసీపీ వినీత్ తెలిరు. ప్రభాకర్‌ను పట్టుకున్న మాదాపూర్ సీసీఎస్ పోలీసులు వెంకట్‌రెడ్డి, ప్రదీప్, వీరస్వామికి రివార్డులు అందజేసినట్టు వెల్లడించారు. మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్, క్రైం డీసీపీ శశాంక్, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబ్ , డీఐ రాజేశ్ పాటు పలువురు సమావేశంలో పాల్గొన్నారు.