ఆంటనానరివో, అక్టోబర్ 14: ప్రపంచవ్యాప్తంగా రాజుకుంటున్న జెన్ జీ ఉద్యమం మరో ప్రభుత్వాన్ని కూల్చివేసింది. సెప్టెంబర్‌లో నేపాల్ ప్రభుత్వాన్ని పగడగొట్టిన యువజన ఉద్యమం నెలరోజుల వ్యవధిలో ఆఫ్రికన్ దేశమైన మడగాస్కర్ ప్రభుత్వాన్ని పతనం చేసింది. సైన్యంలోని కొన్ని విభాగాలు కూడా జెన్‌జీ ఉద్యమానికి మద్దతు ఇవ్వడంతో అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా దేశం విడిచి పారిపోయారు. సైన్యం తిరుగుబాటు చేసి నిరసనకారులతో చేతులు కలపడంతో అధ్యక్షుడు రాజోలినా ఆదివారం రాత్రి దేశం విడిచి పారిపోయినట్లు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు సిటేనీ రాండ్రియనసోలోనియాకో సోమవారం ప్రకటించారు. రాజోలినా ఆచూకీ తెలియరాలేదని తెలిపారు. సోమవారం రాత్రి ఫేస్బుక్ ద్వారా ప్రసారమైన ఓ వీడియోలో తన ప్రాణాన్ని రక్షించుకునేందుకు తాను సురక్షిత ప్రదేశానికి తరలిపోయినట్లు రాజోలినా ప్రకటించారు. తాను ఎక్కడ ఉన్నదీ ఆయన వెల్లడించనప్పటికీ మడగాస్కర్ నాశనం అయ్యేందుకు తాను అనుమతించబోనని చెప్పారు. ఈ ప్రసంగం అనంతరం పదవి నుంచి తప్పుకోవడానికి రాజోలినా అంగీకరించలేదని దౌత్యవర్గాలు వెల్లడించాయి.
ఫ్రెంచ్ సైనిక విమానంలో పరారీ
ఒకప్పటి ఫ్రెంచ్ వలసరాజ్యమైన మడగాస్కర్ నుంచి ఫ్రెంచ్ సైనిక విమానంలో రాజోలినా ఆదివారం రాత్రి పారిపోయారని సైనిక వర్గాలు రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్‌తో రాజోలినా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫ్రెంచ్ రేడియో ఆర్ఎఫ్ఐ తెలిపింది. కాగా, గాజా కాల్పుల విరమణపై ఈజిప్టులో జరిగిన శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మాక్రాన్ మాట్లాడుతూ మడగాస్కర్ను వీడేందుకు రాజోలినాకు ఫ్రాన్స్ సాయం చేసినట్లు వస్తున్న వార్తలను తాను వెంటనే ధ్రువీకరించలేనని చెప్పారు. మడగాస్కర్‌లో రాజ్యాంగ పరిరక్షణ జరగాలని ఆయన అన్నారు. ఆ దేశ యువత డిమాండ్లను తాను అర్థం చేసుకోగలనని, అయితే వారి డిమాండ్లను సైన్యం తన స్వప్రయోజనాలకు ఉపయోగించుకోరాదని ఆయన స్పష్టం చేశారు.
రోడ్డెక్కిన జెన్‌జీ ఉద్యమం
నీరు, విద్యుత్తు కొరతలకు నిరసనగా సెప్టెంబర్ 25న మడగాస్కర్వ్యాప్తంగా జెన్‌జీ ఉద్యమం రాజుకుంది. తర్వాత అది ప్రభుత్వ అవినీతి, మౌలిక సేవల లేమి తదితర సమస్యలతో పెనుమంటలుగా వ్యాపించింది. 2009లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడంలో రాజోలినాకు మద్దతు ఇచ్చిన క్యాప్సాట్ అనే సైనిక విభాగం గత శనివారం దేశ రాజధానిలో వేలాదిమంది నిరసనకారులతో జరిగిన ప్రదర్శనలో పాలుపంచుకోవడంతో రాజోలినా పతనం ఆరంభమైంది. అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండు చేస్తూ సోమవారం వేలాదిమంది నిరసనకారులు దేశ రాజధానిలో రోడ్లపైకి వచ్చారు. సెప్టెంబర్ 25 నుంచి నిరసనకారులు, భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న ఘర్షణలలో 22 మంది పౌరులు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
మడగాస్కర్‌లో దుర్భర దారిద్య్రం
దాదాపు 3 కోట్ల జనాభాగల మడగాస్కర్‌లో మూడవ వంతుమంది దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. 1960లో దేశానికి స్వాతంత్య్రం రాగా అప్పటి నుంచి 2020 వరకు దేశ జీడీపీ 45 శాతం పడిపోయింది. కాగా, దేశాన్ని వదిలి పారిపోవడానికి ఒకరోజు ముందు ఆదివారం అధ్యక్షుడు రాజోలినా అనేక మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు తెలుస్తోంది. అందులో ఇద్దరు ఫ్రెంచ్ జాతీయులు కూడా ఉన్నారు. 2021లో దేశంలో తిరుగుబాటుకు కుట్రపన్నారన్న అభియోగాలపై వారిద్దరికీ శిక్ష పడగా అప్పటి నుంచి వారు జైలు జీవితాన్ని గడుపుతున్నారు.