హైదరాబాద్, మే 28(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలులో రైతుల అవసరార్థం సివిల్ సైప్లె సంస్థ తెచ్చిన యంత్రాలు వారికి అక్కర తీర్చకుండా మూలన పడేశారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు, ధాన్యంలోని తాలు తొలగించేందుకు నిరుడు సివిల్ సైప్లె సంస్థ ప్యాడీ డ్రయర్లను (ధాన్యం ఆరబెట్టే యంత్రం), ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేసింది. వందలాది కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఆ యంత్రాలను ఇప్పుడు కవర్లు కప్పి భద్రంగా మూలన దాచి ఉంచారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్న వర్షాలకు కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్యాడీ డ్రయర్లను మార్కెటింగ్ శాఖ, సివిల్ సైప్లె అధికారులు బయటకు తీయడం లేదనే విమవర్శలు వ్యక్తమవుతున్నాయి. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొన్నిచోట్ల రైతులు అడిగినప్పటికీ వాటిని ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. వందలాది కోట్లు వెచ్చించి కొనుగోలు చేసి ఇప్పుడు అవసరమైన సమయంలో వాటిని వినియోగించకపోతే ఉపయోగం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. కవర్లు కప్పి భద్రపరచడానికి కొనుగోలు చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్యాడీ డ్రయర్ల ఆపరేటర్లు లేకపోవడం వల్లే వాటిని బయటకు తీయడంలేదని అధికారులు మాత్రం చెప్తున్నట్టుగా తెలిసింది.
అధిక వర్షాల సమయంలో అత్యవసరమైతే రైతుల ఇబ్బందులు తీర్చేందుకు అవసరమైన యంత్ర పరికరాలను కొనుగోలు చేయాలని మంత్రులు నిరుడు వానకాలం సూచించారు. దీన్ని ఆసరాగా చేసుకొని నాటి అధికారులు అవినీతి దందాకు తెరలేపారనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రుల అత్యవసర వ్యాఖ్యలను ఆసరాగా చేసుకొని సివిల్ సైప్లె సంస్థ ప్యాడీ డ్రయర్లును, ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వరంగ సంస్థల నుంచి కాకుండా జిల్లా స్థాయిలో ప్రొక్యూర్మెంట్ కమిటీలతో అవినీతి తతంగాన్ని నడిపించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి.
ముందే ఎంపిక చేసిన పంజాబ్‌కు చెందిన పలు కంపెనీలతో కుమ్మక్కై వీటిని కొనుగోలు చేశారని, టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో వీటిని కట్టబెట్టినట్టు ఆరోపణలున్నాయి. సుమారు 1,000 వరకు ప్యాడీ క్లీనర్లు, 100 వరకు ప్యాడీ డ్రయర్లను కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఒక్కో ప్యాడీ క్లీనర్‌ను రూ.2 లక్షల చొప్పున కొనుగోలు చేయగా, ఒక్కో ప్యాడీ డ్రయర్‌ను రూ.14 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్టు తెలిసింది.
బహిరంగ మార్కెట్లో రూ.11-12 లక్షల ధర ఉండగా ఇక్కడ రూ.2-3 లక్షలు అదనంగా వెచ్చించినట్టు ఆరోపణలున్నాయి. ఇలా అంతా కూడబలుక్కొని నామినేషన్ పద్ధతిలో కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు భారీ ఎత్తున వినిపించాయి. వాటి కొనుగోలు వల్ల రైతులకు ఏమైనా ఉపయోగం జరిగిందా? అంటే అదీ లేకుండా పోయింది. వందలాది కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన పరికరాలు ఇప్పడు వృథాగా పడి ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.